గెలుపెవరిది : కర్నూలు జిల్లాలో కోట్లలో పందేలు

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 03:49 PM IST
గెలుపెవరిది : కర్నూలు జిల్లాలో కోట్లలో పందేలు

కాయ్ రాజా కాయ్.. ఇపుడు ఏపీలో ఎక్కడికి వెళ్లినా ఇదే వినిపిస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలోనే కాదు… జిల్లాల్లోనూ ఈ సౌండ్ గట్టిగా వినిపిస్తోంది. కర్నూలు జిల్లాలో ఇంకాస్త ఎక్కువే ఉంది. ఎన్నికల  ముందు పొలిటికల్ హీట్‌ రాజేసిన ఈ డిస్ట్రిక్ట్.. ఇపుడు పందెంరాయుళ్లకు పండగని తెచ్చిపెట్టింది. నెల తర్వాత ప్రకటించే ఫలితాలపై పందెంరాయుళ్లు చెలరేగిపోతున్నారు. ఏపీలో పొలిటికల్ బెట్టింగ్స్ హాట్ టాపిక్ అయ్యాయి. రీసెంట్‌గా ముగిసిన ఎన్నికల పోలింగ్‌కు.. ఫలితాల వెల్లడికి మధ్య చాలా గ్యాప్ ఉండడంతో బెట్టింగ్ దందాను జోరుగా సాగిస్తున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికివారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండడంతో బెట్టింగ్‌లను ఓ రేంజ్‌కి తీసుకెళ్తున్నారు.

కర్నూలు జిల్లాలో సాగుతున్న పందేలు.. క్రికెట్ బెట్టింగ్‌ను మించిపోయాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఏ అభ్యర్థి గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? ఏ పోలింగ్ కేంద్రంలో ఎవరికి ఎన్ని  ఓట్లు వస్తాయి? మహిళలు ఎవరికి మద్దతు ఇచ్చారు? పసుపు కుంకుమ పథకం ప్రభావం ఎంత? అధికారం ఎవరిని వరిస్తుంది? ఇలా… రకరకాల ఈక్వెషన్స్‌తో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దశాబ్దాల రాజకీయ వైరం ఉన్న కోట్ల – కేఈ, బైరెడ్డి – గౌరు వంటి ప్రధాన రాజకీయ శత్రువర్గాలు ఒక్కటయ్యాయి. జిల్లాలో రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేశాయి. ఫలితాలపై ఈ ప్రభావం తప్పకుండా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈసారి వీటిపై కూడా బెట్టింగ్‌లు కూడా రంజుగా సాగుతున్నాయి.

బనగానపల్లి ఫలితంపై కడప జిల్లాలోనూ భారీ స్థాయిలో బెట్టింగ్ జరుగుతుండగా… ఆలూరు రిజల్ట్‌పై పక్క రాష్ట్రమైన కర్నాటకలోనూ పెద్ద ఎత్తున పందెంకాస్తున్నారు. ఇక్కడ నువ్వా-నేనా అనే రీతిలో ఫలితం  ఉండబోతోందని అంచనా వేస్తున్న పందెంరాయుళ్లు బెట్టింగ్ జోరును పెంచేశారు. ఆదోని నియోజకవర్గంలో టీడీపీదే గెలుపని కొందరు… వైసీపీ విజయం ఖాయమని మరికొందరు లక్షల్లో బెట్టింగ్‌లకు  దిగుతున్నారు. కోడుమూరు, కర్నూలు, ఆళ్లగడ్డ, నంద్యాల శాసనసభ స్థానాలతోపాటు… కర్నూలు లోక్‌సభ స్థానంపైనా కాయ్ రాజా కాయ్ అంటున్నారు బెట్టింగ్‌ నిర్వాహకులు. కోట్ల రూపాయలను  కుమ్మరించేస్తున్నారు బెట్టింగ్ బంగార్రాజులు. ఇలా జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో బెట్టింగ్‌లు సాగుతున్నాయి.