65లక్షల ఎన్టీఆర్‌లను, చంద్రబాబులను ఎదుర్కోగలరా?

టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని ఐటీ దాడులు చేయిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. వైసీపీ, టీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై ఐటీ దాడులు ఉండవని, టీడీపీ వాళ్లపై కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
టీడీపీలో ప్రతి కార్యకర్త ఒక ఎన్టీఆర్, ఒక చంద్రబాబేనని చంద్రబాబు అన్నారు. 65లక్షల మంది ఎన్టీఆర్‌లను, చంద్రబాబులను ఎదుర్కోవడం ఎవరి తరం కాదన్నారు. ఐదేళ్ల బీజేపీ అన్యాయాలపై ఆంధ్రుడి యుద్దం ఎన్నికలు అని చంద్రబాబు చెప్పారు. ఈ ధర్మపోరాటంలో టీడీపీకి విజయం తథ్యమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు జనంపై డబ్బులు వెదజల్లడం అహంభావంకు ప్రతిరూపమని చంద్రబాబు విమర్శించారు. కేసీఆర్, మోడీ పంపిన డబ్బు సంచులతో వైసీపీ పేట్రేగిపోతుందని చంద్రబాబు విమర్శించారు. ఓట్ల కొనుగోళ్లకు వైసీపీ కొత్తరకం స్కెచ్ వేసిందని, పాంప్లెట్ల పంపిణీ ముసుగులో కూపన్లు ఇస్తున్నారని, కూపన్లు తీసుకెళ్తే 2రోజుల్లో నగదు ఇస్తామంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.