ఆత్మకూరు ఎన్నికల అధికారులపై క్రిమినల్ కేసులు

ఏపీలో ఎన్నికల అనంతరం రాష్ట్ర ఎన్నికల అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పులు బయటపడడం తీవ్ర సంచలనం రేకేత్తించింది. దీనిపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం ఎన్నికల అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కలెక్టర్ కంప్లయింట్‌తో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఆత్మకూరు ఆర్డీవో చిన్న రాముడు, ఎమ్మార్వో విద్యాసాగరుడుపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.
ఏప్రిల్ 15వ తేదీ గవర్నమెంట్ హై స్కూల్ ఆవరణలో వీవీ ప్యాట్ స్లిప్పులు బయటపడి ఉన్నాయి. పోలింగ్ కంటే ముందు ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన ఈవీఎంలలో 1000 ఓట్లను బెల్ ఇంజినీరింగ్ అధికారులు పోల్ చేశారు. ఈ స్లిప్పులే బయటపడ్డాయి. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఆత్మకూరులో దొరికిన వీవీప్యాట్ స్లిప్పులు… పోలింగ్ నాటివి కాదని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలను ఈవీఎంల కమిషనింగ్ సెంటర్‌గా మాత్రమే వినియోగించామన్నారు. పోలింగ్‌కు ముందే ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన ఈవీఎంలలో వెయ్యి ఓట్లను బెల్ ఇంజినీర్లు పోల్ చేశారని, ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాత వాటిని పోలింగ్ కేంద్రాలకు తరలించారని తెలిపారు.