3 రాజధానులు వద్దు..అమరావతే ముద్దు : 25వ రోజూ రైతుల నిరసనలు
మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు... ఈ నినాదమే ఇపుడు ఏపీ రాజధాని గ్రామాల్లో హోరెత్తుతోంది. నిన్న యుద్ధ వాతావరణాన్ని తలపించిన క్యాపిటల్‌లో ఇవాళ కూడా రైతులు కదం తొక్కబోతున్నారు.

మూడు రాజధానులు వద్దు… అమరావతే ముద్దు… ఈ నినాదమే ఇపుడు ఏపీ రాజధాని గ్రామాల్లో హోరెత్తుతోంది. నిన్న యుద్ధ వాతావరణాన్ని తలపించిన క్యాపిటల్‌లో ఇవాళ కూడా రైతులు కదం తొక్కబోతున్నారు.
మూడు రాజధానులు వద్దు… అమరావతే ముద్దు… ఈ నినాదమే ఇపుడు ఏపీ రాజధాని గ్రామాల్లో హోరెత్తుతోంది. నిన్న యుద్ధ వాతావరణాన్ని తలపించిన క్యాపిటల్‌లో ఇవాళ కూడా రైతులు కదం తొక్కబోతున్నారు. మొన్నటివరకు ర్యాలీలు, పాదయాత్రలు, ధర్నాలు, బైఠాయింపులతో రైతుల నిరసనగా తెలపగా… నిన్న ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు పూజలు చేయాలన్న కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అలజడి రేగింది. మహిళలపై లాఠీఛార్జ్ చేయడం, కొందరు గాయపడటం లాంటి ఘటనలు మరింత హీటు పెంచాయి. ఈ తరుణంలో… 25వరోజు నిరసనలో భాగంగా ఇవాళ బైక్ ర్యాలీకి సిద్ధమయ్యారు రైతులు. మరోవైపు… అమరావతి పరిణామాలను సుమోటాగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్…ఇవాళ రాజధాని గ్రామాల్లో పర్యటించనుంది.
రాజధాని గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ రైతులు బైక్ ర్యాలీ నిర్వహించబోతున్నారు. మందడం నుంచి విజయవాడలోని గుణదల వరకు ర్యాలీకి సిద్ధమయ్యారు. అయితే… ర్యాలీలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు జరపవద్దని సూచిస్తున్నారు. ముందుజాగ్రత్తగా అమరావతి గ్రామాలన్నింటిలో భారీగా పోలీసులను మోహరించారు. బైక్ ర్యాలీని అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే… ఒకవేళ పోలీసులు అడ్డుకుంటే ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని రైతులు నిర్ణయించారు.
మరోవైపు…. మందడం, తుళ్లూరులో రైతులు మహా ధర్నాలు, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలేదీక్షలు కంటిన్యూ అవుతున్నాయి. ఉద్దండరాయునిపాలెంలోను వివిధ గ్రామాలకు చెందిన రైతులు నిరసనలు తెలుపుతున్నారు. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెంతోపాటు ఇతర గ్రామాల్లోను ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటి ఘటనలో గాయపడిన వారు… గాయాలకు కట్టిన కట్లతో నిరసన తెలియజేస్తున్నారు.
అమరావతిలో జరుగుతన్న పరిణామాలపై జాతీయ మహిళా కమిషన్ సుమోటాగా స్వీకరించి విచారణకు సిద్దమైంది. దీంతో… కమిషన్‌లోని ముగ్గురు సభ్యుల బృందం ఇవాళ అమరావతి గ్రామాల్లో పర్యటించనుంది. ఆందోళనలు చేస్తున్న మహిళలను కలిసి వారి నుండి సమాచారం సేకరించనుంది. పోలీసుల దాడికి సంబంధించిన అంశాలపై ఆరా తీయనుంది. దీంతో… వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, పోలీసుల తీరుపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. నిన్నటి ఘటనల వీడియోలు, ఫొటోలను కమిషన్ సభ్యులకు అందించబోతున్నారు.
మరోవైపు… నిన్నటివరకు అమరావతి ఆందోళనలకు మద్దతుగా ప్రజాచైతన్య యాత్ర చేపట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు…ఇవాళ మూడోరోజు కూడా దానిని కొనసాగించబోతున్నారు. ఇవాళ్టి నుంచి ఇతర ప్రాంతవాసుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయబోతున్నారు. ఇందులో భాగంగా రాయలసీమలో ప్రజాచైతన్య యాత్ర చేపడుతున్నారు. రాజధానిగా అమరావతినే ఎందుకు కొనసాగించాలనే దానిని వివరించేందుకు తిరుపతిలో సభ ఏర్పాటు చేస్తున్నారు.
మొత్తంగా ఓవైపు రైతుల ఆందోళనలతో ఆ ప్రాంతం అట్టుడుకుతుండటం… మరోవైపు మహిళా కమిషన్ విచారణ జరుపుతుండటం… ఇంకోవైపు నాయకుల మధ్య డైలాగులు పేలుతుండటంతో రాజధాని వ్యవహారం ఏపీలో హీట్ పెంచింది. అయితే… ఇవాళ రైతులు బైక్ ర్యాలీకి సిద్ధమవుతుండటం, దానిని అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టడంతో ఇవాళ ఏం జరగనుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.