ప్రకృతి సేద్యం : మజ్జిగ, గంజి, ఆవు మూత్రమే అతని ఆయుధం…

ప్రకృతి సేద్యం : మజ్జిగ, గంజి, ఆవు మూత్రమే అతని ఆయుధం…

Farming Without Chemicals Without Fertilizers And Pesticides Farming 918

Updated On : June 21, 2021 / 10:43 PM IST

కృష్ణా : మజ్జిగ…గంజి..ఆవుతో అద్బుతాలు చేస్తారా ? ఖర్చులేని వ్యవసాయం ఎలా చేయవచ్చో చూపిస్తున్నాడు. పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడో ఓ యువ రైతు. వ్యవసాయానికి అతను సూచిస్తున్న సూత్రాలు అందర్నీ ఆలోచింప చేస్తున్నాయి.
యువ రైతు అయినా మేలైన పనితనం..
మజ్జిగ, గంజి, ఆవు మూత్రమే అతని ఆయుధం
రూపాయి ఖర్చు లేకుండా వ్యవసాయం
అద్భుతాలు సృష్టిస్తున్న కృష్ణా జిల్లా యువకుడు

35 ఏళ్ల పల్లెపోతుల శబరినాథ్ జన్మస్థలం కృష్ణాజిల్లా ఏ.కొండూరు గ్రామం. తన కుటుంబంలో ఉన్నవారికి బీపీ, మధుమేహం ఉండటాన్ని గుర్తించి దీనికి కారణం పండిస్తున్న ఆహార పంటలే అని తెలుసుకున్నాడు. తన  కుటుంబాన్ని కాపాడాలనే ప్రయత్నంలో .. తనకున్న ఆరున్నర ఎకరాల పొలంలో .. రసాయన మందుల పిచికారి లేకుండా పంటలను పండించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా సేంద్రీయ ఎరువులను తయారుచేసి  పంటలను పండించడం మొదలుపెట్టాడు.
ఆరున్నర ఎకరాల్లో 14 రకాల వరి వంగడాలు .. సేంద్రీయ ఎరువులతోనే పండిస్తున్నాడు. కేవలం మజ్జిగ, గంజి, ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, నేల నుంచి తీసిన మట్టి మాత్రమే తన పొలానికి వినియోగిస్తూ .. మంచి  ఫలితాన్ని రాబడుతున్నాడు. డిగ్రీ చదువు, తనకున్న తెలివితేటలు  వ్యవసాయానికి బాగా దోహదపడ్డాయి. దీంతో అతను రైతుగా మారాడు.
కలుపు నివారణకు మాన్ సింగ్ ఫిట్స్…
తన సంకల్పానికితోడు గుంటూరులోని పుల్లడిగుంట రైతు నేస్తం శిక్షణ కేంద్రంలో.. శిక్షణ  పొందాడు. దాన్ని ఫాలో అవుతూ అతను పండిస్తున్న పంటలు బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, గుండె జబ్బులు వారికి, చిన్నపిల్లలకు పౌష్టికాహారంగా ప్రయోజనకరమని చెబుతున్నాడు. తైవాన్ పింకు జామతోపాటు దైవం లేడి అనే బొప్పాయి పంటను అంతర్ సాగుగా వేస్తున్నాడు. జామలో అయిడన్ పద్ధతిలో ఎకరానికి వెయ్యి మొక్కలు నాటి, కలుపు నివారణకు మాన్ సింగ్ ఫిట్స్ ఉపయోగించి వీటిలో అంతర్  పంటగా మిర్చి, బెండ, వంగ, బంతి, దానిమ్మ సాగు చేస్తున్నాడు. తొలి ఏడాది నుంచే మంచి కాపు వచ్చిందని, రెండవ ఏడాది తనకు ఆదాయం వచ్చిందని చెబుతున్నాడు.
గరళకంట కషాయముతో…
గరళకంట కషాయముతో కలుపు నివారణ చర్యలు చేపట్టాడు. ముందుగా కలుపు మొక్కలను వేరుతో తొలగించి బూడిద చేస్తారు. ఈ బూడిదకు 100 గ్రాములు ఆవు మూత్రం, 100 గ్రాముల పంచదార కలిపి మూడు రోజులపాటు  ఒక డ్రమ్ములో నిల్వవుంచుతారు.  అనంతరం ఆ ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుతారు. ఆ తరువాత దాన్ని మూడు రోజుల పాటు నిల్వ ఉంచాలి. అలా తయారైన టాటా గరళకంఠ కషాయాన్ని కలుపు నివారణకు పిచికారీ  చేయాలని చెబుతున్నాడు. ఇలా మేలైన సాగు పద్ధతుల్లో పండించిన వరి రకాలను సాటి రైతులకు విత్తనాలు విక్రయించి .. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుతున్నాడు.  కృషి, పట్టుదల ఉండాలే కానీ సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు శబరినాథ్‌. ప్రతీ ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.