జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత ఆయనే.. ఆ వ్యక్తి బీజేపీలో చేరబోతున్నారా? అందుకే మౌనంగా ఉంటున్నారా?

janasena nadendla manohar: జనసేన పార్టీ అంటే అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు.. ఆయన వెన్నంటి ఉండే నాదెండ్ల మనోహర్ గుర్తొస్తారు. అలాంటి మనోహర్ ఇప్పుడేమయ్యారనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. పార్టీని, అధినేతని వెనకుండి నడిపించిన ఆయన కొంతకాలంగా మౌనంగా ఉండిపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకపక్క అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉంటే.. పార్టీని నడిపించాల్సిన మనోహర్ మాత్రం ఆ చొరవ తీసుకోవడం లేదంటున్నారు.
నాదెండ్ల మనోహర్ మౌనం, కార్యకర్తల్లో అయోమయం:
గత ఎన్నికల్లో బోల్తా పడ్డ జనసేన పార్టీ ఆ తర్వాత కోలుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదంటున్నారు. జనసేన పార్టీ ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉంటే… మిగిలిన నేతలు పార్టీని పూర్తిగా గాలికొదిలేశారని కార్యకర్తలు ఫీలవుతున్నారు. పార్టీ విషయాల్లో నేతలు అంటీముట్టనట్టు ఉంటున్నారు. పార్టీకి సైనికులు ఉన్నా.. సేనానుల లోపంతో మరింత బలహీన పడుతోంది. చివరికి పార్టీలో నెంబర్ టూగా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా పార్టీ విషయంలో సైలెంట్‌గా ఉండడంతో పార్టీ పరిస్థితి ఏంటో తెలియక అయోమయంలో ఉన్నారు జన సైనికులు.
మనోహర్ తీరుపై చర్చ:
కీలక విషయాల్లో జనసేన నుంచి ప్రెస్‌నోట్లు మాత్రమే మీడియాకు రిలీజ్ అవుతున్నాయే తప్ప అటు పవన్ గానీ.. ఇటు మనోహర్ గానీ మాట్లాడడం లేదు. పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్స్‌లో ఉన్నారు కనుక పొలిటికల్ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడిగా మనోహర్ అయినా బయటకి రావొచ్చు కదా అంటున్నారు పార్టీలో ఉన్న కొద్దిమంది నేతలు. ఆ మధ్య అమరావతిలో ఒకరోజు పర్యటించిన ఆయన.. ఆ తర్వాత మరే అంశాల్లోనూ స్పదించకపోవడం పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
జనసేనకు నాదెండ్ల మనోహర్ గుడ్ బై?
పార్టీ విషయంలోనూ, అధినేత పవన్ విషయంలోనూ నాదెండ్ల మనోహర్ అంత ఆసక్తి చూపడం లేదంటున్నారు. పవన్ సినిమాల్లోకి వెళ్లడం, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అంతగా వర్కవుట్ అవ్వకపోవడం, పార్టీ మరింత బలహీనపడటం వంటి అంశాల నేపథ్యంలో మనోహర్ దూరంగా ఉంటున్నారని టాక్. ఇక సోషల్ మీడియాలో అయితే నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి తప్పుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారాలను ఆయన సన్నిహితులు, జనసేన నేతలు ఖండిస్తున్నారు. ఈ వార్తలపై ఆయన నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎన్నికల ముందు పార్టీని నడిపించిన మనోహర్… ఆ తర్వాత పార్టీ విషయంలో అంత సీరియస్‌గా లేకపోవడం… అధినేత లేని సమయంలో కనీసం నేతలకు అందుబాటులోకి రాకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. ఆయన బీజేపీలో చేరాలని భావిస్తున్నారనే ప్రచారం కూడా మొదలైంది. మరి ఈ విషయంలో పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలంటున్నారు కార్యకర్తలు.