ఏ పోరాటమైనా కలిసే చేస్తాం.. ఫిబ్రవరి 2వ తేదీన కవాతు

  • Published By: vamsi ,Published On : January 22, 2020 / 01:53 PM IST
ఏ పోరాటమైనా కలిసే చేస్తాం.. ఫిబ్రవరి 2వ తేదీన కవాతు

Updated On : January 22, 2020 / 1:53 PM IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటికే పొత్తు పెట్టుకున్న జనసేన, బీజేపీ కూటమి సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఇప్పటికే ఏ విషయంలో అయినా కలిసి పోరాడుతాం అని ప్రకటించిన ఇరు పార్టీలు మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేశాయి. అమరావతి రైతులకు మద్దతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా కవాతు రూపంలో ఫిబ్రవరి 2వ తేదీన విజయవాడలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించింది బీజేపీ-జనసేన కూటమి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై పవన్ కళ్యాన్, కన్నా లక్ష్మీనారాయణ, నాదెండ్ల మనోహన్, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి వంటి నేతలు ఈ సమావేశంలో చర్చించగా.. అనంతరం వారు ఈ అంశాలను మీడియాకు వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఓసారి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జనవరి 28న మరోసారి రెండు పార్టీల ముఖ్య నేతలు భేటీ అవుతారని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.

ఇకపై ధర్నాలు, ఆందోళనలు ఏం చేసినా రెండు పార్టీలు కలిసే చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు కవాతు నిర్వహించాలని రెండు పార్టీలు నిర్ణయించినట్టు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.