పవన్‌ను కలిశాడు.. జనసేన టిక్కెట్ వచ్చేసింది. గెలుపు ఖాయమేనా?

  • Published By: vamsi ,Published On : March 20, 2019 / 05:35 AM IST
పవన్‌ను కలిశాడు.. జనసేన టిక్కెట్ వచ్చేసింది. గెలుపు ఖాయమేనా?

Updated On : March 20, 2019 / 5:35 AM IST

జ‌న‌సేన పార్టీ నుంచి  బ‌రిలోకి దిగ‌నున్న‌ అసెంబ్లీ అభ్య‌ర్ధుల రెండో జాబితాలను విడుదల చేశాక మిగిలినవాటికి వేగంగా అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌కళ్యాణ్‌ను కలిసి ఆ పార్టీలో చేరిన సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి ఆ పార్టీ టిక్కెట్‌ను ఖరారు చేశారు జనసేనాని. 2004, 2009లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పని చేసిన యర్రం వెంకటేశ్వర రెడ్డి, 2014లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు.

కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కారణంగా అప్పటి ఎన్నికల్లో  వెంకటేశ్వరరెడ్డికి 3 వేల 200 ఓట్లు  మాత్రమే వచ్చాయి. అప్పటినుంచి ఆయన కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలను నియోజక వర్గంలో నిర్వహిస్తూ.. ఏఐసీసీ సభ్యునిగా కొనసాగారు. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే గెలవడం కష్టం అని భావించిన వెంకటరెడ్డి జనసేనలో చేరగా.. చేరిన వెంటనే ఆయనకు పవన్ టిక్కెట్ ఇచ్చేశాడు.

ఇక సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కోడెల శివప్రసాదరావు తెలుగుదేశం తరుపున, అంబటి రాంబాబు వైసీపీ తరుపున పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొననుంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి కోడెల 924ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే తెలుగుదేశం అభ్యర్ధి కోడెల మీద, వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు మీద అసమ్మతి ఉండడంతో వెంకటేశ్వర రెడ్డికి కలిసి వస్తుందని భావిస్తున్నారు.