కాళేశ్వరం ప్రాజెక్ట్ మరో అడుగు: 3, 4 మోటార్ల వెట్‌రన్

పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో అడుగు పడింది. ప్రాజెక్టులోని 6వ ప్యాకేజీలోని 3,4 మోటార్ల వెట్ రన్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఓ వైపు బ్యారేజీలు…మరోవైపు టన్నెళ్లు, గ్రావిటీ కెనాల్స్ నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. లింక్-1లో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పూర్తయ్యాయి. లింక్-2లో 6, 7, 8 టన్నెల్స్ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి కానుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఇవి రెండు చాలా కీలకం. ఇప్పటికే 6వ ప్యాకేజ్‌లో రెండు మోటార్లను విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు….మరో రెండు మోటార్లతో గోదావరి జలాలను ఎత్తి పోయడానికి కసరత్తు మొదలు పెట్టారు. కోటి ఎకరాలకు సాగునీరు అదించాలన్న లక్ష్యంతో కరీంనగర్ జిల్లాలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో తొలి అడుగు విజయవంతమైంది.
దీంతో మరో ముందడుగు వేయడానికి అధికారులు రెడీ అయ్యారు. లింక్-2లో భాగంగా నిర్మాణమవుతున్న 6,7, 8 ప్యాకేజీ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మొదటగా గోదావరి నీటిని 6వ ప్యాకేజ్‌లోని మెటార్లు ఎత్తిపోస్తాయి. ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించడానికి 6వ ప్యాకేజీ నీటిని తరలించడానికి పాలకుర్తి మండలం వేంనూరు వద్ద హెడ్ రెగ్యులేటర్‌ను నిర్మించారు. ఇక్కడి నుంచి కిలోమీటర్ మేర నిర్మించిన కెనాల్ ద్వారా గోదావరి నీళ్లు ప్రయాణించిన తర్వాత….9.53 కిలోమీటర్ల పొడవున్న రెండు సొరంగాల ద్వారా సర్జ్‌పూల్‌కు చేరుకుంటాయి. సర్జ్‌పూల్ చేరిన తర్వాత భారీ మోటార్లతో లిఫ్ట్ చేస్తారు.
ఈ సర్జ్ పూల్లో 143 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. 375 మీటర్ల పొడవు….25 మీటర్ల వెడల్పుతో నిర్మించిన సర్జ్‌పూల్ కెపాసిటీ 0.097 టీఎంసీలు. రెండు సొరంగ మార్గాల ద్వారా నీరు వచ్చి చేరుతుంది. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, గోలివాడ, ఎల్లంపల్లి ద్వారా సర్జ్‌పూల్లోకి నీటిని లిఫ్ట్ చేసేందుకు వంద మీటర్ల దూరంలో భూగర్భంలో అత్యాధునిక జర్మన్ టెక్నాలజీతో 7 మోటార్లను బిగిస్తున్నారు. ఇప్పటికే నాలుగు గేట్ల నిర్మాణం పూర్తి కాగా, మిగతా మూడు గేట్ల నిర్మాణం జరుగుతోంది. గత నెలలో రెండు మోటార్ల ట్రయల్ రన్ పూర్తవగా…మరో రెండు మోటార్ల ట్రయల్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకే సారి రెండు మోటార్లను రన్ చేసి….ఎలాంటి ఆటంకాలు లేకుండా నీటిని లిఫ్టు చేయడంతో అధికారులు, ఇంజినీర్లు సంబురాలు చేసుకున్నారు.
రెండు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో..మరో రెండు మోటార్ల వెట్ రన్ నిర్వహించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. 6వ ప్యాకేజ్‌లో ఒక్కో మోటార్ సామర్థ్యం 124.7 మెగావాట్లు. ప్రతి మోటార్ 112 మీటర్ల లోతులో ఏర్పాటు చేసిన గేట్లు తెరచిన తర్వాత నీరంతా మోటార్ల వద్దకు చేరుకుంది. ఒక్కో మోటార్ సెకనుకు 3వేల 2వందల క్యూసెక్కుల నీటిని వంద మీటర్ల పైకి ఎత్తిపోస్తుంది. ఇప్పటికే సర్జ్‌పూల్‌లో తగినంత నీటిని నిల్వ చేశారు. రెండు మోటార్లు…ఒక కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేశారు. 3, 4 మోటార్లను రన్ చేయాలని అధికారులు భావిస్తున్నప్పటికీ…పరిస్థితులను బట్టి ఒకటి చేయాలా లేదంటే రెండింటిని ఒకే సారి రన్ చేయాలా అన్న దాన్ని పరిశీలిస్తున్నారు.
సర్జ్‌పూల్‌లోని నీటిని లిఫ్ట్ చేసేందుకు భూగర్భంలోనే పంప్‌హౌస్‌తో పాటు విద్యుత్ కంట్రోల్ యూనిట్ల నిర్మాణం జరుగుతోంది. మోటార్ల కోసం సర్జ్‌పూల్ ఉపరితలంలో సబ్ స్టేషన్ నిర్మించారు. ప్రతి కంట్రోల్‌కు అనుసంధానం చేశారు. సర్జ్‌పూల్ ద్వారా లిఫ్ట్ చేసిన నీటిని నిల్వ చేసుకునేలా కాళేశ్వరం ప్రాజెక్ట్ 7,8,9,10,11,12,13 ప్యాకేజ్‌ల్లో భాగంగా మిడ్‌మానేర్, ఎగువమానేరు, లక్ష్మీపూర్, అనంతారం, దిగువమానేరు, కొండపోచమ్మ, మల్లన్నసాగర్ వంటి రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోంది. 8వ ప్యాకేజ్ నుంచి పునర్జీవ పథకంలో భాగంగా శ్రీరామ్ సాగర్‌తోపాటు అదనపు జలాలు నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల్లోకి తరలించేలా నిర్మాణాలు జరుగుతున్నాయి.