బోటు ఇప్పట్లో బయటకు రాదు: కిషన్ రెడ్డి

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, కచ్చులూరు మధ్య గోదావరి నదిలో రాయల్ వశిష్ట బోటు ప్రమాదం జరిగి వారం రోజులు అవుతున్నా కూడా ఇంకా బోటు ఆచూకీ మాత్రం తెలియలేదు. బోటు ఎక్కడో 375 అడుగుల లోతులో ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం చెబుతుంది. బోటులో మొత్తం 77 మంది ప్రయాణించినట్టు అధికారులు నిర్ధారించారు. వీరిలో 26 మంది బయటపడగా, వారం రోజుల్లో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో 36 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా మరో 15 మంది ఆచూకీ తెలియవలసి ఉంది. వీరి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
అయితే లేటెస్ట్ గా ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ సహాయశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి సమీక్ష జరిపారు. అనంతరం మాట్లాడిన జి.కిషన్‌రెడ్డి ‘కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటు ను వెలికి తీసే పరిస్థితి ఇప్పుడు లేదు. బురద మట్టి, ఇసుకలో బోటు కూరుకుపోయిందనే అంచనా, గల్లంతైనవారూ అందులో ఉండవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బోటును బయటకు తీసే అవకాశం లేదు’ అని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులతో బోటు ప్రమాదంపై చర్చించిన కిషన్ రెడ్డి మృతదేహాలను బయటకు తీసేందుకు యంత్రాంగం దృష్టి పెట్టిందని అన్నారు. కేంద్రం నుంచి ఎటువంటి సాంకేతిక సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, టూరిజం నిబంధనలు కఠినంగా ఉండాలని అన్నారు. ప్రైవేట్ బోటైనా, టూరిజం బోటైనా, ప్రభుత్వ సర్వీసు బోటైనా నిబంధనలు ఒకేలా ఉండాలని అన్నారు.