LB Stadium లో జనసేన సభ : ఏప్రిల్ 02న ఏపీకి మాయావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ నేతలు క్యూ కడుతున్నారు. ఆయా పార్టీలకు మద్దతుగా లీడర్స్ ప్రచారం చేస్తూ ఆయా వర్గాలకు చెందిన ఓటర్లను అట్రాక్టివ్ చేసే పనిలో ఉన్నారు జాతీయ నేతలు. టీడీపీకి సపోర్టుగా కేజ్రీవాల్, మమత బెనర్జీ, ఫరూఖ్ అబ్దుల్లా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాజాగా జనసేన పార్టీ అభ్యర్థుల విజయం సాధించాలని బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతి ఏపీ రాష్ట్రానికి రానున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ వెల్లడించింది. ఏప్రిల్ 01వ తేదీన ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.
బహుజన సమాజ్ పార్టీతో జనసేన పొత్తులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కదనరంగంలోకి దిగిన జనసేన బీఎస్పీ అభ్యర్థులను కొన్ని నియోజకవర్గాల్లో నిలబెట్టింది. అందులో భాగంగా మాయావతి రెండు రోజుల పాటు ఏపీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. కాన్షీరాం తనకు ఆదర్శమని, ఎలాంటి ప్రచార సాధనాలు (టీవీ, పత్రికలు) అవసరం లేకుండానే పార్టీని నిర్మించి చూపించారని పవన్ చెబుతుంటారు.
ఏప్రిల్ 02వ తేదీ మంగళవారం రాత్రికి మాయావతి విశాఖపట్టణానికి రానున్నట్లు జనసేన వెల్లడించింది. ఏప్రిల్ 03వ తేదీ బుధవారం ఉదయం విశాఖలో జనసేన అధ్యక్షులు పవన్‌తో కలిసి ప్రెస్ మీట్‌లో మాయావతి మాట్లాడనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3గంటలకు విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించే బహిరంగసభల్లో మాయావతి పాల్గొంటారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఏప్రిల్ 04వ తేదీ గురువారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరిగే బహిరంగసభకు ఆమె హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ఈ సభ జరుగనుంది. అదే రోజు సాయంత్రం పవన్‌తో కలిసి హైదరాబాద్ చేరుకుంటారు