ఎమ్మార్వో ముందు జాగ్రత్త : ఆమె తాడు కడితే ఈయన కిటీకి పెట్టించాడు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మాట్లాడాలని వచ్చిన రైతు ఎమ్మార్వో

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మాట్లాడాలని వచ్చిన రైతు ఎమ్మార్వో
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మాట్లాడాలని వచ్చిన రైతు ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన తర్వాత రెవెన్యూ ఉద్యోగుల్లో వణుకు మొదలైంది. భద్రత గురించి బాగా టెన్షన్ పడుతున్నారు. దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చే వారు ఎలా ప్రవర్తిస్తారో తెలియక వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారోనని హడలిపోతున్నారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా బెంబేలెత్తిపోతున్నారు. అది కాకుండా ఇటీవలి కాలంలో ఎమ్మార్వో ఆఫీస్ లకి వచ్చే వారు పెట్రోల్ బాటిళ్లు తీసుకొని వస్తున్నారు. తమకు న్యాయం జరక్కపోతే ఆత్మహత్య చేసుకుంటామని కొందరు, పెట్రోల్ పోసి తగలబెడతామని కొందరు రెవెన్యూ ఉద్యోగులను బెదిరిస్తున్నారు.
దీంతో రెవెన్యూ సిబ్బందికి ప్రాణభయం పట్టుకుంది. ఎమ్మార్వోలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొన్న ఏపీలో ఓ ఎమ్మార్వో అధికారిణి తన చాంబర్ లో అడ్డంగా తాడుకట్టి రక్షణ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. దరఖాస్తులు ఇచ్చే వారు ఎవరైనా ఆ తాడు బయటి నుంచే ఇవ్వాలి. దాన్ని దాటి లోనికి వెళ్లకూడదు. ఇప్పుడు మరో ఎమ్మార్వో ఆమె బాటలోనే నడిచారు. సేఫ్ సైడ్ చేసుకున్నారు. ఏకంగా ఆఫీస్ లో కిటీకి ఏర్పాటు చేసుకున్నారు. జగిత్యాల జిల్లాలో ఓ ఎమ్మార్వో కిటికీ నుంచే దరఖాస్తులు తీసుకుంటున్నారు.
ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు ఇచ్చేందుకు అర్జీదారులు ఇచ్చే పత్రాలను కిటికిలోంచే అధికారులు తీసుకుంటున్నారు. తమ కార్యాలయానికి వచ్చిన వారిని ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బాధితులను లోపలికి పిలిస్తే గేటు దగ్గర వారిని వీఆర్‌ఏలు తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. కాగా, ఈ చర్యలపై రెవెన్యూ ఆఫీస్ కి వెళ్లే వారు మండిపడుతున్నారు. ఇదెక్కడి చోద్యం అని విస్తుపోతున్నారు. ఎక్కడో జరిగిన ఘటనకు తమను దూరం పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం పనిచేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటున్నారు. ఏ తప్పూ చేయనప్పుడు భయపడటం ఎందుకని అడుగుతున్నారు.
అధికారులు మాత్రం ఈ విమర్శలను పట్టించుకోవడం లేదు. తమ జాగ్రత్త తమది అంటున్నారు. భద్రతపరంగా కొన్ని ఏర్పాట్లు చేసుకోవడం తప్పడం లేదంటున్నారు. ఇలాంటి ఏర్పాట్లతో తాము టెన్షన్ లేకుండా డ్యూటీలు చేసేందుకు అవకాశం కలుగుతుందని చెబుతున్నారు. కాగా.. ఇప్పటికే చాలామంది ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని ఎమ్మార్వో ఆఫీసుల్లో పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేశారు.