రికార్డు వర్షం : నల్గొండలో 6 గంటలు..20 సెం.మీటర్లు

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. నాలుగు గంటల్లో 181 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 45 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా నల్గొండలో కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా 6 గంటల్లో 20 సెంటిమీటర్ల వర్షం పడింది. ఇది కొత్త రికార్డు అని వాతావరణ శాఖ పేర్కొంది.
గత 119 ఏళ్ల వాతావరణ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి వర్షం పడడం ఇదే తొలిసారి అన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. పలు కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. రహదారులున్నీ జలమయమయ్యాయి. పంటలు నీట మునిగాయి.
జిల్లాలోని పెద్దవూర, హాలియా, నిడమనూరు, త్రిపురారం, దామరచర్ల, మిర్యాలగూడ, కన్ గల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. తిప్పర్తి, మాడ్గులపల్లి, కట్టంగూరు, తిరుమలగిరి, కొండమల్లేపల్లి, మునుగోడు, శాలిగారారం, డిండి, చండూర్, నార్కెట్ పల్లి, అడవిదేవులపల్లి, దేవరకొండ, పెద్ద అడిశర్లపల్లి ప్రాంతాల్లో మోస్తారు జల్లులు కురిశాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.