దోస్తులు దోస్తులే..! కలిసి పనిచేస్తారా..గ్రూపులు కడుతారా

ఇద్దరూ కలిసే ఉంటారు. కానీ.. ఇద్దరికీ క్షణం కూడా పడదు. ఎక్కడున్నా ఎవరి గ్రూప్ వారిదే.. ఎవరి రాజకీయం వారిదే. ఒకరి ఆధిపత్యాన్ని భరించలేక ఇంకొకరు వెళ్లిపోతే.. అదే బాటపట్టారు మరో నేత. ఇప్పుడు మళ్లీ ఇద్దరూ కలిశారు. మరి ఇప్పుడైనా కలిసి పనిచేస్తారా.. లేక గ్రూపులు కడతారా… ఖమ్మం జిల్లాలో రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలో చాలా ప్రత్యేకతలను ఖమ్మం పాలిటిక్స్ చాటుకుంటున్నాయి. టీడీపీ ప్రారంభమైనప్పటి పార్టీలో ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు. పార్టీ కోసం కష్టపడటమే కాకుండా మంత్రిగా జిల్లా అభివృద్ధికి కృషి చేశారనే పేరుంది. జిల్లా వ్యాప్తంగా మంచి పట్టుంది. ఏది చెప్పినా చెల్లుబాటయ్యేది.
2003లో టీడీపీలో చేరారు నామా నాగేశ్వరరావు. 2004లో ఎంపీ టికెట్ సాధించినా.. ఓటమి పాలయ్యారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. తుమ్మలకు కార్యకర్తల బలం ఉంటే.. నామాకు ఆర్థికబలం ఉండేది. క్రమంగా జిల్లాలో పార్టీపై పట్టు సాధించారు నామా. అంతే.. తుమ్మలను విభేదించిన కిందిస్థాయి కేడర్ నామాకు వైపునకు మళ్లింది. దీంతో… తుమ్మల-నామా గ్రూపులుగా ఏర్పడ్డాయి. ఒకే పార్టీలోనే ఉన్నా.. ఇద్దరికీ క్షణం పడేది కాదు. ఏ ఎన్నిక జరిగినా.. విజయం కోసం కాకుండా.. ఒక వర్గం నేతను ఓడించేందుకు మరో వర్గం నేత ప్రయత్నించేవారనే అపవాదు ఉండేది. ఇతర పార్టీల మద్దతు తీసుకునే వారనే ప్రచారం కూడా అప్పట్లో ఉండేది.
2014 ఎన్నికల సమయంలో ఇద్దరూ టీడీపీలోనే ఉన్నా… ఒకరికి ఒకరు సహకరించుకోకపోవడం వల్లే ఓటమి పాలయ్యారనే వాదన ఉంది. ఇక.. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. తల్లిలాంటి టీడీపీని వదిలేందుకు నామానే కారణమంటూ వీలు చిక్కినప్పుడల్లా ఆరోపణలు చేసిన తుమ్మల.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా.. మంత్రి పదవి చేపట్టారు. 2018 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానంలో మాత్రమే టీఆర్ఎస్ విజయం సాధించింది. రాజకీయ ఉద్దండుడిగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావు సైతం ఓటమి పాలయ్యారు.
ఉప్పు నిప్పులా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు… నామా నాగేశ్వరరావు ప్రస్తుతం గులాబీ గూట్లోకి చేరిపోయారు. ఇక్కడే రాజకీయం రంజుగా మారుతోంది. నామా టీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మొన్నటి వరకు రాజకీయ వైరుద్యం ఉన్న తుమ్మల… మూడు నెలల కిందటి వరకు ప్రత్యర్థిగా ఉన్న పువ్వాడ.. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓడించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి… ఇప్పుడు వీళ్లంతా కలిసి నామ నాగేశ్వరరావు గెలుపును తమ భుజస్కందాలపై వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇన్నాళ్లూ నామాను వ్యతిరేకించిన నేతలు.. ఉనికి కోసం పార్టీ మారిన లీడర్లు… గత ఎన్నికలలో ప్రత్యర్థులుగా ఉన్న ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఒకే గొడుగు కిందకు రావడం పొలిటికల్ సర్కిల్ చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ప్రత్యర్థులు.. క్షణం కూడా పడని శత్రువులు.. ఇప్పుడు మిత్రులుగా మారి కలిసి పనిచేస్తారా… ఒకరికొకరు ఎలా సహకరించుకుంటారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.