రాజధానుల నిర్ణయంతో కేంద్రానికి సంబంధం లేదు: పవన్ కళ్యాణ్

  • Published By: vamsi ,Published On : January 22, 2020 / 12:34 PM IST
రాజధానుల నిర్ణయంతో కేంద్రానికి సంబంధం లేదు: పవన్ కళ్యాణ్

Updated On : January 22, 2020 / 12:34 PM IST

రాజధాని ఎక్కడికి పోదు.. శాశ్విత రాజధాని అమరావతే.. రాజధానిని కదిలించే సత్తా ఎవరికీ లేదు.. అని ఇప్పటికే ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరోసారి ఇదే విషయాన్ని ఢిల్లీ గడ్డ మీద నుంచి ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన అనంతరం.. మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశానికి బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి, జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు అందించినా గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం యుటిలిటీ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని సీతారామన్ వారికి చెప్పినట్లు నేతలు వెల్లడించారు. ఈ సంధర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. త్వరలోనే రాజధాని విషయంలో బీజేపీ-జనసేన బలమైన ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తుందని అన్నారు.  ఏపీ ఆర్థిక పరిస్థితి, అమరావతి రాజధాని అంశాలపై నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్లు చెప్పారు. విభజన నుంచి ఇప్పటి వరకు కేంద్రం చేసిన సాయం గురించి కేంద్ర మంత్రి వెల్లడించారని చెప్పారు.

అలాగే ‘అమరావతి ప్రజలకు, 5 కోట్ల మంది ఆంధ్రులకు, రైతులకు మాటిస్తున్నా. అమరావతే ఏపీ శాశ్వత రాజధాని అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విశాఖలో రిపబ్లిక్ డే నిర్వహించాలనుకుని సగం పనులు చేసిన తర్వాత ఎలాగైతే వెనక్కి తగ్గారో.. రేపు రాజధాని విషయంలో కూడా అంతేనని అన్నారు. అతే సమయంలో మూడు రాజధానులకు కేంద్ర సమ్మతి ఉందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. కేంద్రం సమ్మతి లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో కేంద్రానికి సంబంధం లేదు. ’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.