సర్వం శివోహం : కీసరలో బ్రహ్మోత్సవాలు

పురాతనమైన కీసరగుట్టలో శివనామస్మరణ మారుమోగుతోంది. శివరాత్రి పండుగను పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 02వ తేదీ శనివారం నుండి మార్చి 7వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. దీనితో భక్తులు భారీగా కీసర గుట్టకు తరలివస్తున్నారు. కీసర శ్రీరామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించనున్నారు. క్రీడల, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి ప్రారంభించనున్నారు.
శివుడికి అత్యంత ప్రీతికర దినమైన సోమవారం నాడు మహాశివరాత్రి పండుగ రావడం భక్తులు భారీగా తరలివస్తారని ఆలయ నిర్వాహకులు, అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు వెల్లడిస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి కీసరగుట్టకు 300 ఆర్టీసీ బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మార్చి 03వ తేదీ నుండి స్పెషల్ బస్సులు అందుబాటులో ఉండనున్నట్లు, ప్రతి పది నిమిషాలకు అదనపు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
కీసరగుట్ట ఆలయం పురాతమైన ఆలయం. రంగారెడ్డి జిల్లాలో ఓ గుట్టపై ఉంది. కీసరగుట్ట ఆలయం రంగారెడ్డి జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో, ECILకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివరాత్రి పండుగ సందర్భంగా టెంపుల్‌కి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.