ఎన్నికలు : నిఘా నీడలో ఏపీ

ఆంధ్రప్రదేశ్‌లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేయాలని.. అధికార, ప్రతిపక్ష పార్టీలు .. పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాయి. పోలింగ్ కేంద్రాల్లో అధికారపార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడతారని ప్రతిపక్షపార్టీ నేతలు ఆరోపిస్తుంటే.. ప్రతిపక్షపార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని అధికారపార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అసలు ఎన్నికల సమయంలో ఏం జరుగుతుందో తెలియక .. ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఏపీలో ఎన్నికలు జరిగే సమయంలో ఎప్పడు ఏం జరుగుతుందోనని.. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 1800 పైనే సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని.. టీడీపీ నేతలు పోలీసు అధికారులను కోరుతున్నారు. లేని పక్షంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ నిర్వహించేందుకు కూడా వెనకాడరని .. ఫీర్యాదు చేస్తున్నారు. మరోపక్క ప్రతిపక్షనేతలు సైతం.. అధికార పార్టీ నేతలపై నేరుగా వెళ్లి ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ చేసేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఇప్పటికే మన్యం ప్రాంతాలు, మావోలు సంచరించే ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్ భద్రత కట్టుదిట్టం చేసింది. అయితే భద్రత పెంచినప్పటికీ కొన్ని పోలింగ్ ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పవని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే పాడేరు, అరకు నియోజకవర్గాల్లోని 14 పోలింగ్ బూత్‌లను విలీనం చేస్తూ .. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో బుంగనపట్టు, కుసంపట్టు పోలింగ్ కేంద్రాలను .. మచ్చాపురం తరలించారు. అంతేకాకుండా బూసిపట్టు, సరియాపల్లి, కెండు గూడ, జామిగూడ, గుంజివీధి పోలింగ్ కేంద్రాలను .. మద్దుల బండకు తరలించారు. గిన్నెలకోటలోని 58, 59 పోలింగ్ కేంద్రాలు, ఇంజారి పోలింగ్ కేంద్రం తరలించారు. పాడేరు నియోజకవర్గంలోని కాకునూరు, పెదలంక కొత్తూరు, కిల్లంకోటలోని 196, 197 పోలింగ్ కేంద్రాలను సమీపంలోని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇదిలావుంటే .. ఇప్పటికే సమస్యత్యక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో .. సిబ్బంది కొరత ఉందని గ్రహించిన ఎన్నికల కమిషన్… ఏపీకి ఇంకా సాయుధ బలగాలు కావాలని కేంద్రానికి లేఖ రాశారు.