గ్రామ సచివాలయ పరీక్షలు : APPSC ఉద్యోగుల కుటుంబసభ్యులకే ర్యాంకులు – బాబు

  • Published By: madhu ,Published On : September 22, 2019 / 01:14 AM IST
గ్రామ సచివాలయ పరీక్షలు : APPSC ఉద్యోగుల కుటుంబసభ్యులకే ర్యాంకులు – బాబు

Updated On : September 22, 2019 / 1:14 AM IST

గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తి ప్రక్రియపై ఏపీలో రగడ కొనసాగుతూనే ఉంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. పరీక్షలను రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.. తాజాగా టీడీపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జత కలిశారు. వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ సచివాలయ పరీక్షలను రద్దు చేయాలని, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో భారీ అవకతవకలు జరిగాయని  మాజీ సీఎం, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. APPSC ఉద్యోగుల కుటుంబ సభ్యులకే ర్యాంకులు వచ్చాయని.. అదే సమయంలో కష్టపడి చదివిన వారికి కోతలు మిగిలాయని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేనంత చెడ్డపేరు ఏపీపీఎస్సీకి గ్రామ సచివాలయ పరీక్షలతో వచ్చిందన్నారు. 19 లక్షల అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లారని ఆయన విమర్శించారు. ప్రశ్నాపత్రాల లీకేజికి కారకులైన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని, మళ్లీ పారదర్శకంగా పరీక్షలను నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

గ్రామ సచివాలయ పరీక్షా పత్రం లీకేజీపై టీడీపీ మండిపడుతుంటే.. మరోవైపు జనసేన కూడా దీనిపై ఆరోపణలు గుప్పిస్తోంది. పారదర్శకత మాటల్లో కాదని చేతల్లో చూపించాలని జనసేన అధినేత పవన్.. ట్విట్టర్‌లో ఘాటుగా వ్యాఖ్యానించారు. పేపర్ లీక్ ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని అన్నారు. వ్యవస్థ కారణంగా యువత ఇబ్బందిపడే పరిస్థితి రాకూడదని పవన్ హితవు పలికారు. జీవితాలు మారతాయన్న కొండంత ఆశతో అభ్యర్థులు పరీక్ష రాశారని, పరిస్థితి చూస్తుంటే అధికార పార్టీకి కొమ్ముకాసే వారికే ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా ఉందని ఆరోపించారు. పేపర్ లీకేజి వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
Read More : వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
> ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షల ఫలితాలను సీఎం జగన్ గురువారం (సెప్టెంబర్ 19,2019) రిలీజ్ చేశారు.
> సచివాలయ పోస్టులకు సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు.
> లక్ష 26వేల 728 పోస్టులకు 19.74 లక్షల మంది పరీక్షలు రాశారు.
> పరీక్షలు నిర్వహించిన 10 రోజుల్లోనే ఫలితాలు రిలీజ్ చేయడం విశేషం.
> గ్రామ, వార్డు సచివాలయాల్లో 19 రకాల పోస్టులకు పరీక్షలు పెట్టారు.
> అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీల్లో ట్రైనింగ్ ఇస్తారు.
> అక్టోబర్ 2 నుంచి విధుల్లో చేరుతారు.
> ఏపీలో అక్టోబర్ 2 నుంచి సచివాలయాలు అందుబాటులోకి వస్తాయి.