టీడీపీకి మరో షాక్: వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ

  • Published By: vamsi ,Published On : January 22, 2020 / 10:57 AM IST
టీడీపీకి మరో షాక్: వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ

Updated On : January 22, 2020 / 10:57 AM IST

అమరావతిపై శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం సాగుతున్న క్రమంలోనే ప్రకాశం జిల్లాలో తెలుగు దేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతిపై బిల్లు విషయంలో టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత ఆ పార్టీకి కూడా రాజీనామా చెయ్యనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీలో చేరబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. 

శాసనమండలిలో టీడీపీ విప్‌ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన ఆమెపై టీడీపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలోనే ఆమెపై చర్యలకు సిద్ధం అయ్యింది. దివంగత పరిటాల రవి అనుచరుడు పోతుల సురేశ్ భార్య పోతుల సునీత అనే విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆమె ఓడిపోయారు. 

ఎన్నికల తర్వాత ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరగా.. పోతుల సునీతకు ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం కల్పించారు. తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కూడా ఆమె బాధ్యతలు చేపట్టారు. టీడీపీలో క్రియాశీలంగా ఉండే ఆమె.. ఇప్పుడు పార్టీ మారుతుండడంతో ఆ పార్టీకి షాక్ తగిలినట్లే అయ్యింది. ఆమె జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లుగా సమాచారం.