పశ్చిమలో తీరం దాటేదెవరు : భయపెడుతున్న జనసేన

  • Published By: madhu ,Published On : April 19, 2019 / 01:42 PM IST
పశ్చిమలో తీరం దాటేదెవరు : భయపెడుతున్న జనసేన

Updated On : April 19, 2019 / 1:42 PM IST

సార్వత్రిక ఎన్నికలు పశ్చిమలో రాజకీయ పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నికలు పూర్తైనా నాయకుల్లో మాత్రం ఇంకా టెన్షన్‌ తగ్గలేదు. జిల్లాలో అభ్యర్థులు అందరూ గెలుపు మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నా… జనసేన ఎవరిని ఎలా దెబ్బకొట్టిందో అన్న భయంతో ఉన్నారు. అసలు జిల్లాలో రాజకీయ పార్టీల అంచనాలు ఎలా ఉన్నాయి.. జనసేన పార్టీ ఎంత వరకు జిల్లాలో ఎన్నికలను ప్రభావితం చేయనుంది..? కొందరు అభ్యర్థుల గెలుపునకు జనసేన గండి కొట్టనుందా.. పశ్చిమ గోదావరి జిల్లాలో నెలకొన్న రాజకీయ మార్పులపై 10tv కథనం.

పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఏ రాజకీయ పార్టీ వైపు ఉంటే..  ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఇది గత ఎన్నికలను పరిశీలించిన వారెవరికైనా తెలుస్తుంది. గతంలో ఏ ఎన్నికలు జరిగినా ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్న పార్టీ .. వెనుతిరిగి చూడాల్సిన అవసరం కనిపించలేదు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, 2014 ఎన్నికల్లో టీడీపీ జిల్లా నుంచి అత్యధిక సీట్లు సాధించి..  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ అందర్నీ కలవర పెడుతోంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ మూడో పార్టీగా పోటీ చేయడం, కుల సమీకరణాలను ప్రభావితం చేయడంతో.. రెండు ప్రధాన పార్టీలకు ప్రాణ సంకటంగా మారి.. నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

గత ఎన్నికల్లో టీడీపీ 14 సీట్లు గెలిచింది. జిల్లాలో జరిగిన అభివృద్ధిపై నమ్మకంతో.. ఈ ఎన్నికల్లో కూడా అన్ని సీట్లు తమవే అంటూ టీడీపీ నేతలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం ఖాయం అంటోంది వైసీపీ. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, నవరత్నాలు, బీసీ డిక్లరేషన్ తమకు కలసి వస్తాయని అంటోంది. ఈ రెండు పార్టీలకు జనసేన రూపంలో భయం పట్టుకుంది. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో జనసేన తన అభ్యర్థులను పోటీలో నిలబెట్టింది. అటు పార్లమెంటు స్ధానాల్లోనూ ప్రభావం చూపింది.. గెలుపోటముల మాట ఎలా ఉన్నా .. మిగిలిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు జనసేన గండంలా తయారైంది. 

పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం అసెంబ్లీతో పాటు నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో జనసేన గట్టి పోటీ ఇచ్చిందని అంచనా. పవన్ కళ్యాణ్ పోటీలో ఉండటంతో భీమవరంలో ఏ అభ్యర్థి గెలుస్తారో అనేది కూడా సర్వే సంస్థల అంచనాలకు కూడా అందడం లేదు. దీనికి తోడు నరసాపురం పార్లమెంటు పరిధిలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అన్నీ .. జనసేన పార్టీకే వేయాలనే కులసమీకరణ తీర్మానాలు గ్రామాల్లో చేసినట్లు తెలుస్తోంది. దీంతో భీమవరంలో కాపుల ఓట్లు గంపగుట్టగా జనసేనకు పడ్డాయని ప్రచారం జరుగుతోంది. 

నరసాపురం అసెంబ్లీలో పోటీలో ఉన్న బొమ్మిడి నాయకర్ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక్కడ మత్స్యకారుల ఓట్లు 40వేల వరకు ఉన్నాయి. ఈ ఓట్లకు తోడు కాపుల ఓట్లు జనసేనకు పడతాయనే ధీమాతో ఆ పార్టీ నేతలు తమదే గెలుపు అంటున్నారు. జిల్లాలో టీడీపీ 7 సీట్లు వస్తాయనే అంచనాలో ఉంటే .. వైసీపీ 10 సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు అనుకున్నట్లు సీట్లు సాధిస్తాయో లేక జనసేన రూపంలో తారుమారు అవుతాయో అనే అనుమానాల్లో ఉన్నాయి. 

భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలలో కాపుల ఓట్లతో పాటు యువత జనసేనకు ఓట్లు వేస్తారని అంచనాలో ఉన్నారు. దీనికి తోడు ఆచంట, తణుకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జనసేనకు పడినట్లు అంచనాలు వేస్తున్నారు. అయితే పాలకొల్లు, ఆచంట, భీమవరం, తణుకు నియోజకవర్గాల్లో అర్ధరాత్రి వరకు ఓటింగ్ జరగడంతో .. ఆ ఓట్లన్నీ తమకే వస్తాయనే ఆలోచనలో టీడీపీ ఉంది. మొత్తానికి జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాల మాటలు ఎలా ఉన్నా..ప్రతి అభ్యర్థి గెలుపు ఓటములపై మాత్రం జనసేన ప్రభావం కచ్చితంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.