షాద్ నగర్ లో దారుణం : వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య

  • Published By: veegamteam ,Published On : November 28, 2019 / 07:41 AM IST
షాద్ నగర్ లో దారుణం : వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య

Updated On : November 28, 2019 / 7:41 AM IST

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో డాక్టర్ దారుణ హత్యకు గురైంది. 24వ నేషనల్ హైవే దగ్గర ఓ వంతెన కింద వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని దారుణంగా హత్య చేసి గుర్తు తెలియకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బైపాస్ రోడ్డులోని అండర్ బ్రిడ్జి కింద పూర్తిగా తగులబడిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రియాంకారెడ్డిని వేరే ప్రాంతంలో హత్య చేసి..ఇక్కడికి తీసుకొచ్చి తగలబెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి క్లూస్ టీమ్ తో సహా స్పాట్ చేరుకున్నారు. ప్రియాంకారెడ్డి కాల్ లిస్ట్ ను పరిశీలిస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ పుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. 

నవాబుపేట మండలం కొల్లూరు వెటర్నరీ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రియాంకారెడ్డి ఇంటికి వచ్చే సమయంలో తన స్కూటీ పాడైందనీ..కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. ఆ ప్రాంతంలో లారీ డ్రైవర్లు ఉన్నారనీ..తనకు భయంగా ఉందని కూడా చెప్పిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఫోన్ చేసిన తర్వాత ప్రియాంకారెడ్డి ఇలా దారుణ హత్యకు గురవ్వటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

బుధవారం (నవంబర్ 27) సాయంత్రం నుంచి ప్రియాంకా రెడ్డి ఆచూకీ లేదు. గురువారం(నవంబర్ 28,2019) నాటికి దారుణ స్థితిలో పెట్రోల్ పోసి తగుల బెట్టినట్లుగా కనిపించటం కలకలం రేపింది. ఈ దారుణానికి కారకులు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.