ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు: నేడే ప్రారంభం.. కీలక అంశాలు చర్చకు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నేడు(09 డిసెంబర్ 2019) ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బిల్లులపై చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం అయ్యాయి. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సుమారు 10 రోజుల పాటు జరిగే అవకాశం కనిపిస్తుంది.
మొదటి రోజు సభ ప్రారంభం అయ్యాక క్వశ్చన్ అవర్ ముగుస్తుంది. తరువాత బీఏసీ సమావేశం జరుగుతుంది.. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నిరోజులు జరగాలి అనేదానిపై నిర్ణయం తీసుకుంటారు. నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం చేసిన చట్టంపై మరోసారి సభలో చర్చ జరుగనుంది. ఈ సమావేశాల్లో చర్చించడానికి ఇప్పటికే కార్యాచరణ రెడీ చేసింది ప్రభుత్వం. పాఠశాల విద్యలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రధానంగా చర్చించనుంది.
ఆరు నెలల జగన్ ప్రభుత్వం పాలనలో వైఫల్యాలను సభలో గట్టిగా ఎండగట్టేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం వ్యూహాలను సిద్ధం చేసుకుంది. 21 అంశాలు సభలో ప్రస్తావించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి. ఇసుక, ఇంగ్లీష్ మీడియం, రైతులకు గిట్టుబాటు ధర, ఉల్లి, అప్పులు, ప్రభుత్వం జారీ చేసిన జీవోలు.. నిత్యావసర ధరలు రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కచ్చితమైన ప్రణాళికను సిద్ధం చేసుకుంది.
మొదటి రోజు తెలంగాణలో దిశ హత్యాచారంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఆమెకు నివాళి అర్పించిన అనంతరం చర్చ జరిగవచ్చు. ఏపీ ప్రభుత్వం కూడా మహిళలపై అత్యాచారాలు దాడులకు సంబంధించి కీలక చట్టం చేసే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. దీనిపై ఈ సమావేశాల్లోనే చర్చ జరగవచ్చు. ఇప్పటికే దీనిపై సీఎం జగన్ కొన్ని మంత్రులకు, ఎమ్మెల్యేలకు కొన్ని సూచనలు ఇచ్చారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇది రెండవసారి. ఈసారి అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా కూడా హీట్ పుట్టించే అవకాశం ఉంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి దూరంగా ఉన్నారు. గంటా శ్రీనివాస్‌తో సహా మరి కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు రాగా ఈ విషయాలపై ఈ సమావేశాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సొంతపార్టీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు సొంతపార్టీపైనే విమర్శలు చేయగా వీరి వైఖరి అసెంబ్లీలో హీట్ పుట్టించే అవకాశం ఉంది అంటున్నారు.