శిల్పులే చెక్కారు..మేం చెప్పలేదు – యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథార్టీ

యాదాద్రి ఆలయంలో శిల్పాలపై చెలరేగుతున్న వివాదంపై వైటీడీఏ (యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథార్టీ) స్పందించింది. సెప్టెంబర్ 06వ తేదీ శుక్రవారం వైటీడీఏ ప్రత్యేక అధికారి కిషన్ రావు, శిల్పులు మీడియాకు వివరణనిచ్చారు. శిలలపై రాజకీయ ప్రతిమలు చెక్కారా లేదా అనేది పరిశీలించడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ను ఓ దేవుడిగా చూసి..శిల్పులు చెక్కారని, ఇందులో తాము ఎలాంటి సూచనలు ఇవ్వలేదన్నారు శిల్పి ఆనంద్ సాయి.
యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణంలో భాగంగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్ చిత్రంతో పాటు కారు బొమ్మను చెక్కారంటూ అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. దీనితో వైటీడీఏ స్పందించాల్సి వచ్చింది. కేవలం బాహ్యా ప్రాకారంలోనే ఈ బొమ్మలున్నాయన్నారు. తామే చెక్కడం జరిగిందని..దీనికి సంబంధించిన ఓ లెటర్ తమకు శిల్పులు ఇచ్చారని తెలిపారు.
చరిత్రను ప్రతిబింబింపచేసేవి ఆలయాలన్నారు. గతంలో చారిత్రక ఆనవాళ్లను శిల్పులు చెక్కడం జరుగుతోందని, ఏ ఆలయంపైనైనా అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా శిల్పాలు చెక్కడం సహజమేనన్నారు. ఇది ఏ వ్యక్తి కోసమో చెక్కినవి కావన్నారు. కారు మాత్రమే కాదు..ఎడ్లబండి, సైకిల్ కూడా ఉన్నాయని, ఇది పెద్ద వివాదం కాదన్నారు.
ఆలయంలో మొత్తం 5 వేల శిల్పాలున్నాయని, ప్రభుత్వం ఒక యజ్ఞంలా ఆలయ పునర్ నిర్మాణ పనులు చేయిస్తోందన్నారు. అహోబిలం శిలలపై నెహ్రూ, గాంధీ బొమ్మలు ఉన్నాయన్నారు. ఎవరి బొమ్మలు చెక్కాలనేది శిల్పుల ఇష్టమన్నారు. అహోబిలం శిలలపై నెహ్రూ, గాంధీ బొమ్మలున్నాయని గుర్తు చేశారు. ఒకవేళ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైతే ఆలోచిస్తామన్నారు.