మళ్లీ భారీ వర్షాలు..! ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక, భయాందోళనలో ప్రజలు
వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు.
Ap Heavy Rains : వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజల విలవిలలాడిపోతున్నారు. వాగులు, వంకలు, నదులు పోటెత్తాయి. వరద నీరు జనావాసాల్లోకి వచ్చేసింది. ఊళ్లకు ఊళ్లు వరద నీటిలో మునిగాయి. జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. ఇది చాలదన్నట్లు వాతావరణ శాఖ ఏపీకి మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
సెప్టెంబర్ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని ఇది ఉంటుందని పేర్కొంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే కుండపోత వానలు, వరదలతో అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు.
ఏపీలో వరదలు విలయం సృష్టించాయి. ఇప్పటి వరకు 15 మంది మృతి చెందారు. ముగ్గురు గల్లంతయ్యారు. 20 జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. 3,79,115 ఎకరాల్లో వ్యవసాయ పంట నష్టం జరిగింది. 34 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 1067.57 కిలో మీటర్లు మేర రోడ్లు దెబ్బతిన్నాయి.
Also Read : విజయవాడ ముంపునకు ప్రధాన కారణం ఏంటి? ఈ పాపం ఎవరిది?
భారీ వర్షాలు, వరద ఉధృతి కారణంగా ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ సృజన ఆదేశాలతో స్కూళ్లకు సెలవు ఇచ్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.