ఫోనీ తుఫాన్ : వాతావరణ శాఖ హెచ్చరికలు

ఫోని తుఫాన్ అతి తీవ్ర తుఫాన్ గా మారి తీరానికి ముంచుకొస్తుంది. మచిలీపట్నానికి కేవలం 500 కిమీ దూరంలో కేంద్రీకృతమైన ఫోని.. వాయువ్య దిశగా పయనిస్తుంది. 2019, మే 01వ తేదీ బుధవారం గమణాన్ని మార్చుకుని ఈశాన్య దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని RTGS హెచ్చరించింది.
గంటకు 22 కిలోమీటర్ల వేగంతో ఒడిశా తీరం వైపుగా దూసుకొస్తోంది. మే 3 తేదీ మధ్యాహ్నానికి ఒడిశాలోని గోపాల్ పూర్ – చాంద్ బలి మధ్య తీరాన్ని దాటే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 205 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశముందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఫోని తుపాన్ ప్రభావం ఏపీపై పెద్దగా ఉండే అవకాశం లేదనే అధికారులంటున్నారు. 2, 3వ తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విశాఖ జిల్లాలో ఒక మోస్తరు వర్షం కురుస్తుందని, తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. పెను తుఫాన్ కారణంగా సముద్రం ఇప్పటికే అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ పరిసరాల్లో భారీ ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి.
పెను గాలుల ప్రభావంతో విద్యుత్ లైన్లు, సెల్‌ఫోన్ టవర్లు కుప్పకూలే అవకాశమున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను కేంద్ర విపత్తునిర్వహణశాఖ అప్రమత్తం చేసింది. ఏపీ, తమిళనాడు, ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాలకు హెచ్చరికలు జారీచేసింది. అటు తూర్పుతీరంలోని కోస్ట్ గార్డ్, నేవీ సిబ్బంది సైతం అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా హెలికాప్టర్లు, యుద్ధ నౌకలను సిద్ధంగా ఉంచారు.
ఫోని తుఫాన్‌పై కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, బెంగాల్ సీఎస్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒడిశా, బెంగాల్‌తో పాటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్‌గార్డ్, షిప్పింగ్, టెలికాం సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశాలు జారీచేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ సూచించింది.