ఏపీకి వడగాల్పుల హెచ్చరిక.. ఈ 9 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం
తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
Heat Waves: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. రాష్ట్రంలో రేపు తీవ్ర వడగాల్పులపై అలర్ట్ ఇచ్చింది. 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందంది. పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలను ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించింది. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, జగ్గంపేట, కోరుకొండ, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో హీట్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది.
మొత్తం 32 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఎన్టీఆర్ జిల్లాలో 7 మండలాలపై అత్యధిక ప్రభావం ఉండనుంది. ఇక శనివారం రాష్ట్రవ్యాప్తంగా 90 మండలాల్లో వడగాల్పుల అవకాశం ఉందంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. కడపలో అత్యధికంగా 40.7°C ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది.
తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా టోపీ, గొడుగు పెట్టుకోవాలంది. ఇక వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంది. వడ దెబ్బ నివారణకు తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలని సూచనలు చేసింది. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Also Read: AP కేబినెట్ భేటీ.. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం
