తెలంగాణ బడ్జెట్ లెక్కలు కసరత్తు, కొంతమేర కుదించే అవకాశం!

తెలంగాణ బడ్జెట్ లెక్కలు కసరత్తు, కొంతమేర కుదించే అవకాశం!

Telangana budget 2021-22 : తెలంగాణ ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌కు సమాయాత్తమవుతోంది. బడ్జెట్‌ రూపకల్పనపై ఆర్థికశాఖ దృష్టి సారించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం, కరోనా ప్రభావం నేపథ్యంలో…..ఈసారి బడ్జెట్‌ తగ్గే అవకాశం కనిపిస్తోంది. వాస్తవ రాబడి, వ్యయాలకు దగ్గరగా బడ్జెట్‌ ఉండేలా రూపొందించాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులతో సమీమక్ష నిర్వహించారు. గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌, రాబడి, వ్యయాలపై పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆదాయ, వ్యయ వివరాలు : –
మంత్రి ఆదేశాలతో 2020-21 బడ్జెట్‌కు సంబంధించి.. వివిధ విభాగాల నుంచి ఆదాయ, వ్యవ వివరాలను సేకరించి క్రోడీకరిస్తున్నారు. ఆయా శాఖల వారీగా ప్లానింగ్‌, నాన్‌ప్లానింగ్‌లో కేటాయించిన నిధుల లెక్కలు తేల్చుతున్నారు. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం, ఖర్చులకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. అంతేకాదు.. జీఎస్టీ, 15వ ఆర్థికసంఘం, కేంద్ర పథకాల కింద, విపత్తుల నిర్వహణ కింద సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఇచ్చిన నిధులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

నివేదికలు సిద్ధం : –
2020-21 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. మొత్తం గత బడ్జెట్‌ అంచనా లక్షా 82వేల 914.42 కోట్లుగా ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం కింద లక్షా 38 వేల 669.82 కోట్లుగా లెక్కకట్టారు. క్యాపిటల్‌ వ్యయం 22వేల 61.18 కోట్ల కేటాయింపులుగా ప్రకటించారు. రెవెన్యూ మిగులు 4,482.12 కోట్లుగా తేల్చారు. ఆర్థిక లోటు 33,191.25 కోట్లుగా బడ్జెట్‌ అంచనాల్లో ప్రకటించారు. ఇక 2021-22కు సంబంధించిన బడ్జెట్‌ విషయంలో ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులకు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలను సిద్దం చేస్తోంది. ఇప్పటికే అధికారులు బడ్జెట్‌ రూపకల్పనలో బిజీ అయ్యారు. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం, చేసిన ఖర్చులకు సంబంధించిన నివేదికలను సిద్ధం చేస్తున్నారు. వీటి ఆధారంగానే ఈఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్‌కు అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేయనున్నారు.

కొన్ని రంగాలకు కోత : –
ఈ ఏడాది రూపొందించే బడ్జెట్‌… గత ఏడాదితో పోలిస్తే.. కొంతమేర కుదించే అవకాశముంది. ఆర్థికమాంద్యం, కరోనా ఎఫెక్ట్‌ కారణంగా రాష్ట్రానికి రాబడి తగ్గింది. కరోనా నుంచి ఇంకా కొన్ని రంగాలు పూర్తిస్థాయిలో కోలుకోలేదు. దీంతో ఈ ప్రభావం బడ్జెట్‌పైనా చూపే అవకాశముంది. ప్రతి బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేస్తోన్న తెలంగాణ సర్కార్‌… ఈసారి కొన్ని రంగాలకు కోత విధించే అవకాశముందని ఆర్థికరంగ విశ్లేషకులు చెబుతున్నారు.