TTDP: తెలంగాణలో పోటీపై అయోమయం.. తెలుగు తమ్ముళ్లలో కనిపించని జోష్!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కనిపించడంలేదు. అధికార బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తిచేయటమే కాకుండా మ్యానిఫెస్టో కూడా విడుదల చేసేసింది.

TTDP: తెలంగాణలో పోటీపై అయోమయం.. తెలుగు తమ్ముళ్లలో కనిపించని జోష్!

telangana assembly elections 2023 telugu desam party confusion on contest

Telangana TDP: తెలంగాణ తెలుగుదేశం పార్టీ అయోమయ పరిస్థితుల్లో చిక్కుకుందా? అధినేత అరెస్టుతో క్యాడర్ డీలా పడిపోయిందా.. అసెంబ్లీ ఎన్నికల కోసం మిగిలిన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక.. ప్రచార కార్యక్రమాల్లో దూసుకుపోతుంటే తెలుగు తమ్ముళ్లలో ఆ జోష్ ఎక్కడా కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్న టీటీడీపీ నేతలు.. ఎన్ని స్థానాల్లో బరిలో ఉంటారో..? ఎవరెవరు పోటీ చేస్తారో తేల్చుకోలేకపోతున్నారు.. సొంతంగా పోటీ చేస్తామంటూ టీటీడీపీ ప్రకటిస్తున్నా.. ఎందుకనో ఆ పార్టీ కార్యకర్తల్లో మునుపటి ఉత్సాహం కనిపించడంలేదు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కనిపించడంలేదు. అధికార బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తిచేయటమే కాకుండా మ్యానిఫెస్టో కూడా విడుదల చేసేసింది. ఉధృతంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు విడుదల చేయడంతోపాటు రెండో జాబితా కోసం వడపోత కార్యక్రమంలో బిజీబిజీగా కనిపిస్తోంది. ఇక కమల దళమూ ఎన్నికల ఏర్పాట్లలో తీరిక లేకుండా ఉంది. కానీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా ఊగిసలాటలోనే ఉండిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉండటంతో ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు టీటీడీపీ నేతలు. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించినా, క్యాడర్ బలంగా ఉన్న 30- 40 స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని మరికొందరు సూచిస్తున్నారు.

ఎక్కడ పోటీ చేయాలి..? ఎవరిని పోటీకి పెట్టాలనే విషయంలో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని చెబుతున్నారు. చంద్రబాబు జైల్లో ఉండటంతో అధినేతను కలవడం టీటీడీపీ నేతలకు కష్టంగా మారింది. రాజమహేంద్రవరం వెళ్లి నారా లోకేశ్, బాలకృష్ణలను కలిశారు కాసాని. పోటీ చేసే నియోజకవర్గాలు, ఆశావహులు, జనసేనతో పొత్తు వంటి అంశాలను లోకేశ్, బాలయ్యతో చర్చించారు. ఇదే విషయంపై ఎన్టీఆర్‌ భవన్‌లో తెలంగాణ నేతలతో ప్రత్యేకంగా ఒక సారి సమావేశమయ్యారు బాలకృష్ణ. ఎన్నికల్లో పోటీ చేస్తామని బాలయ్య ప్రకటించినా.. తుది నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబేనంటూ తేల్చేశారు. పోటీ చేసే స్థానాలు, పొత్తులు, అభ్యర్థులపై అధినేత చంద్రబాబుతోనే చర్చించాలని లోకేశ్, బాలకృష్ణ కూడా చెప్పడంతో డైలమాలో పడిపోయింది టీటీడీపీ.

Also Read: కవితకు ఆ ఇద్దరి బాధ్యతలే ఎందుకు అప్పగించారు.. ఆ ఇద్దరు నేతలు ఎవరు?

మరో రెండు మూడు రోజుల్లో పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల విషయంలో స్పష్టత వస్తుందని చెబుతున్నారు కాసాని. షెడ్యూల్ విడుదలై వారం గడుస్తున్నా ఇంకా సమయం కావాలని పార్టీ అధ్యక్షుడు చెబుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. అధినేత నిర్ణయం ఫైనలే అయినప్పటికీ.. పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో ప్రచారం చేసుకోడానికి అడ్డు ఏంటని వాదిస్తున్నారు. ఏదో ఒకటి త్వరగా తేల్చేయాలని లేదంటే ప్రజాక్షేత్రంలో వెనకబడిపోతామని ఆందోళన చెందుతున్నారు.