‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా రివ్యూ.. ఫుల్ ఎక్స్‌ట్రాగా నవ్వించేసిన నితిన్..

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ థియేటర్ లో ఆడియన్స్ ని ఎక్స్‌ట్రా ఆర్డినరీగా అలరించిందా..? లేదా..?

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా రివ్యూ.. ఫుల్ ఎక్స్‌ట్రాగా నవ్వించేసిన నితిన్..

Nithiin Sreeleela Extra Ordinary Man movie Review

Extra Ordinary Man Review : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్స్ నితిన్ అండ్ శ్రీలీల కలిసి నటించిన సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు డిసెంబర్ 8న ప్రేక్షకులా ముందుకి వచ్చింది. రాజశేఖర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్ తో సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని ముందే అంచనాలు నెలకొన్నాయి.

కథ విషయానికొస్తే..
అభి(నితిన్) ఒక జూనియర్ ఆర్టిస్ట్. ఎప్పటికైనా పేరు రాకపోదా అని సంపాదన అంతగా లేకపోయినా సినిమాల్లో చేస్తూ ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా డ్రంక్ & డ్రైవ్ లో లిఖిత(శ్రీలీల)ని సేవ్ చేస్తాడు. అభి తండ్రి(రావు రమేష్)కి యాక్సిడెంట్ అయి రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో ఎలాగైనా అభి జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో లిఖితని ఇంప్రెస్ చేసి తన కంపెనీలో పెద్ద పోస్ట్ కొట్టేస్తాడు. తనలోని నటుడ్ని మర్చిపోయి హ్యాపీగా జాబ్ చేసుకుంటున్న సమయంలో పాత ఫ్రెండ్ వచ్చి డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది, నువ్వే హీరో అంటాడు. మొదట నో చెప్పినా తర్వాత ఒప్పుకుంటాడు. కానీ సినిమా ముందు ఆ హీరో ఛాన్స్ పోవడంతో బాధలో తాగుతూ ఉంటే అక్కడికి ఓ విలన్ మనిషి వస్తాడు. ఆ పేర్లు విని తాను ఇన్నాళ్లు హీరోగా చేయాల్సిన స్క్రిప్ట్ నిజమైన పాత్రలు అని తెలిసి సినిమాలో చేయకపోయినా నిజంగా హీరో అనిపించుకుందాం అని నిజమైన విలన్ ని ఎదుర్కోవడానికి సిద్దమవుతాడు అభి. అభి నిజంగా విలన్ ని ఎదుర్కున్నాడా? అభి చేయాలనుకున్న సినిమా కథ ప్రకారమే తన జీవితంలో జరిగిందా? అభి నటుడు అయ్యాడా? అభి – లిఖితల ప్రేమ ఏమైంది? మధ్యలో రాజశేఖర్ పాత్ర ఏంటి అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
మొదట్నుంచి సినిమాని ప్రమోట్ చేస్తున్నట్టు ఇది ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ అంతా హీరో గురించి చెప్పడం, హీరో – హీరోయిన్స్ సన్నివేశాలు, హీరో ఇంట్లో సన్నివేశాలు ఇవన్నీ కూడా ఫుల్ కామెడిగానే సాగుతాయి. ఇంటర్వెల్ ముందు సినిమా కొంచెం సీరియస్ గా మారుతుంది. ఇంటర్వెల్ తర్వాత హీరో నిజమైన విలన్ ని వెతుక్కొని వెళ్లిన తర్వాత పోలీస్ స్టేషన్ సీన్స్, హీరో – విలన్ సీన్స్, ఊళ్ళో జనాలు.. ఇలా సెకండ్ హాఫ్ కూడా కామెడిగానే సాగుతుంది. చివర్లో మళ్ళీ ఓ సీరియస్ ఫైట్ పెట్టి కామెడీ ట్విస్ట్ తో క్లైమాక్స్ ఇచ్చాడు. సినిమాలో హీరో కొన్ని పెద్ద సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసినట్టు చూపించే సీన్స్, హీరో వచ్చి హీరోయిన్స్ ఇంట్లో ఎంటర్టైన్ చేయడం, హీరో – తండ్రి మధ్య సన్నివేశాలు, పోలీస్ స్టేషన్ లో ఓ సాంగ్, ఊరంతా వచ్చి నితిన్ కి శ్రీలీలని ఇచ్చి పెళ్లి చేయమని అడిగే సీన్స్.. ఇవన్నీ కూడా ప్రేక్షకులని ఫుల్ గా నవ్విస్తాయి.

Also read :  ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్విట్టర్ రివ్యూ ఏంటి..?

నటీనటుల విషయానికొస్తే..
నితిన్ మొదటి నుంచి చివరిదాకా ప్రేక్షకులను ఫుల్ ఎనర్జీతో నవ్విస్తాడు. శ్రీలీల తన అందంతో పాటు పాటల్లో డ్యాన్సులతో అదరగొట్టింది. పోలీసాఫీసర్ గా రాజశేఖర్ సెకండ్ హాఫ్ లో కాసేపే కనిపించినా పర్వాలేదనిపిస్తాడు. నితిన్ తండ్రిగా రావు రమేష్ కూడా కామెడీతో మెప్పిస్తాడు. తల్లిగా రోహిణి, హీరోయిన్ తల్లిగా పవిత్ర లోకేష్ ఓకే అనిపిస్తారు. విలన్ పాత్రలో సుదేవ్ నాయర్ సీరియస్ గాను, కామెడీగాను మెప్పిస్తాడు. బ్రహ్మాజీ, హైపర్ ఆది, సోనియా సింగ్, శ్రీసత్య, హరితేజ.. ఇలా పలువురు యాక్టర్స్ వారి పాత్రల్లో కామెడీ పండించారు.

సాంకేతిక విలువలు..
ఈ సినిమా నితిన్ సొంత బ్యానర్ లో తెరకెక్కించారు. సినిమా కోసం బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. కెమెరా విజువల్స్ కూడా బాగున్నాయి. కామెడీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఒక్క పాట మాత్రం వినడానికి బాగుంది. మిగిలిన పాటలన్ని ఏదో పర్వాలేదనిపించాయి. సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. రైటర్ గా వక్కంతం వంశీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే అందించాడు. డైరెక్టర్ గా ఇది రెండో సినిమా. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాడని చెప్పొచ్చు. ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేయడంలో వక్కంతం వంశీ సక్సెస్ అయ్యాడు.

మొత్తంగా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ గా నితిన్ ప్రేక్షకులని ఫుల్ ఎక్స్‌ట్రాగా నవ్వించేశాడు. ఈ సినిమాకు రేటింగ్ 3 ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడు అభిప్రాయం మాత్రమే.