YS Sharmila : చంద్రబాబు నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల.. కుమారుడి పెళ్లికి ఆహ్వానం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల వెళ్లారు. కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని శుభలేఖను అందజేశారు.

YS Sharmila : చంద్రబాబు నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల.. కుమారుడి పెళ్లికి ఆహ్వానం

YS Sharmila

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి  కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల శనివారం ఉదయం వెళ్లారు. హైదరాబాద్ లోని బాబు నివాసానికి వెళ్లిన షర్మిల.. కుమారుడు రాజారెడ్డి వివాహ శుభలేఖను అందజేశారు. వచ్చే నెల ఫిబ్రవరి 17న వైఎస్ రాజా రెడ్డి పెళ్లికి కుటుంబ సమేతంగా రావాలని చంద్రబాబును షర్మిల ఆహ్వానించారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి – అట్లూరి ప్రియాలకు పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈనెల 18న గోల్కొండ రిసార్ట్ లో నిశ్చితార్థం, ఫిబ్రవరి17న రాజస్థాన్ లో వివాహం జరగనుంది. ఫిబ్రవరి 24న శంషాబాద్ లో రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. చంద్రబాబును కలిసిన తరువాత.. షర్మిల మీడియాతో మాట్లాడారు.. నా కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబును ఆహ్వానించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో ఆయనకు ఉన్న అనుబంధం గురించి చంద్రబాబు గుర్తు చేసుకున్నారని  చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో వైఎస్, చంద్రబాబు ఎలా కష్టపడ్డారో చెప్పారని షర్మిల తెలిపారు. చంద్రబాబుతో భేటీని రాజకీయంగా చూడొద్దని సూచించారు. చంద్రబాబు వేరే పార్టీ, నేను వేరే పార్టీ. ఆయనతో కలిసి రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకులేదు.. రాదని షర్మిల అన్నారు. గతంలో మా పెళ్లిళ్లకు మాతండ్రి రాజశేఖర్ రెడ్డి అందరినీ ఆహ్వానించారని, ఆ సమయంలో చంద్రబాబుసైతం హాజరై మమ్మల్ని ఆశీర్వదించారని షర్మిల గుర్తు చేశారు.

sharmila

నేను గతంలో క్రిస్మస్ కేకు పంపితే తప్పుబట్టారు. నేను చంద్రబాబుకే కాదు అందరికీ పంపించా. తెలంగాణలో కేటీఆర్, హరీష్ రావు, కవితలకు కూడా క్రిస్మస్ కేకు పంపించానని షర్మిల చెప్పారు. రాజకీయాలు అన్నదే జీవితాలు కాదు.. రాజకీయాలు ప్రజల కోసం చేస్తున్న సర్వీస్.. రాజకీయాలు అనేది ప్రొఫెషన్.. ఈ క్రమంలో ఒకరిని ఒకరు మాటలు అనుకుంటాం..కేవలం రాజకీయ ప్రత్యర్థులం మాత్రమే. అందరం ప్రజలకోసమే పనిచేయాలి.. పండుగకో, పెళ్లికో కేకు లాంటివి పంపిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదని షర్మిల అన్నారు. తెలంగాణలో నా పాత్ర విషయంపై కాంగ్రెస్ అదిష్టానం చూసుకుంటుందని షర్మిల చెప్పారు. నేను కాంగ్రెస్ లో ఓ కార్యకర్తను.. అధిష్టానం ఏ బాధ్యత ఇస్తే దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించడం నా బాధ్యత అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవాలని, రాహుల్ ప్రధాని అయితేనే ఈ దేశం బాగుపడుతుందని షర్మిల అన్నారు. రాహుల్ ను ప్రధానినిచేయడమే వైఎస్ఆర్ లక్ష్యం అని షర్మిల గుర్తు చేశారు.

chandra babu

ఇప్పటికే షర్మిల పలువురు రాజకీయ ప్రముఖులకు కుమారుడి వివాహానికి సంబంధించిన శుభలేఖలు అందజేస్తూ వివాహానికి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల  తాడేపల్లిలోని తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి వివాహ శుభలేఖను అందజేశారు. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖుల నివాసాలకు వెళ్లిన షర్మిల.. కుమారుడి వివాహా శుభలేఖను అందజేశారు. తాజాగా హైదరాబాద్లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల.. చంద్రబాబు, వారి కుటుంబ సభ్యులను కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు. ఇదిలాఉంటే, ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ ను పంపించారు. వైఎస్ఆర్ కుటుంబం నుంచి లోకేశ్ ఫ్యామిలీకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ నోట్ పంపించారు. గిఫ్ట్ పంపినందుకు లోకేశ్ సోషల్ మీడియావేదిక ద్వారా షర్మిలకు శుభాకాంక్షలు తెలిపారు.