సొంతగూటికి తిరిగొచ్చిన జగదీశ్ షెట్టర్.. కాంగ్రెస్‌కు గుడ్ బై, బీజేపీలో చేరిక

కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ తిరిగి సొంతగూటికి వెళ్లిపోయారు.

సొంతగూటికి తిరిగొచ్చిన జగదీశ్ షెట్టర్.. కాంగ్రెస్‌కు గుడ్ బై, బీజేపీలో చేరిక

Jagadish Shettar returns to BJP and jolt for Congress

Jagadish Shettar: కర్ణాటకలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ అధికార కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి సొంతగూటికి తిరిగొచ్చారు. గురువారం ఆయన బీజేపీలో చేశారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్‌స‌భ ఎన్నికల నేపథ్యంలో షెట్టర్ మళ్లీ కమలం పార్టీలోకి వచ్చారు.

అందుకే తిరిగొచ్చా..
నరేంద్ర మోదీని మరోసారి ప్రధాన మంత్రిగా చూడాలన్న లక్ష్యంతోనే బీజేపీలో తిరిగి చేరినట్టు జగదీశ్ షెట్టర్ ఈ సందర్భంగా తెలిపారు. బీజేపీ గతంలో తనకు ఎన్నో పదవులు ఇచ్చిందని, అయితే కొన్ని ఇబ్బందుల కారణంగానే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. బీజేపీలోకి మళ్లీ తిరిగి రావడానికి గత ఎనిమిది, తొమ్మిది నెలల్లో చాలా చర్చలు జరిగాయని వెల్లడించారు. తమ పార్టీలోకి రావాలని బీజేపీ కార్యకర్తలు పట్టుబట్టారని.. యడియూరప్ప, విజయేంద్ర కూడా కోరడంతో సొంతగూటికి తిరిగి వచ్చానని చెప్పారు.

కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి
రాజకీయంగా పలుకుబడి ఉన్న లింగాయత్ వర్గానికి చెందిన జగదీశ్ షెట్టర్ గత ఏడాది ఏప్రిల్‌లో బీజేపీ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్‌లో చేరారు. హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 67 ఏళ్ల షెట్టర్ ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012 13 మధ్యకాలంలో 10 నెలల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1980లో పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన ఆయన అనేక పదవులు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, అసెంబ్లీలో అపొజిషన్ నాయకుడిగా పనిచేశారు. 2008లో తొలిసారిగా కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన అసెంబ్లీ స్పీకర్ అయ్యారు.

Also Read: విపక్షాల ఇండియా కూటమికి షాకిచ్చిన మమతా బెనర్జీ.. రాహుల్ పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు