మా చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారు.. ఇనుప కంచెలు వేసి బందీ చేశారు: షర్మిల

YS Sharmila: తమను ఆపాలని చూసే వైసీపీ నేతలు ముమ్మాటికీ నియంతలేనని అన్నారు. ఇందుకు వారి చర్యలే..

మా చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారు.. ఇనుప కంచెలు వేసి బందీ చేశారు: షర్మిల

YS Sharmila

YS Sharmila: వైసీపీ సర్కారుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీనీ దగా డీఎస్సీ చేశారంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ విషయంపై నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. తమ చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారని తెలిపారు. ఇనుప కంచెలు వేసి తమను బందీ చేశారని అన్నారు.

నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తున్నారని వైఎస్ షర్మిల చెప్పారు. తమను ఆపాలని చూసే వైసీపీ నేతలు ముమ్మాటికీ నియంతలేనని అన్నారు. ఇందుకు వారి చర్యలే నిదర్శనమని చెప్పారు. సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 23 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6 వేలకే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని ఆమె అన్నారు.

కాగా, గురువారం చలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. గత రాత్రి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో వైఎస్ షర్మిల నిద్రించారు. అక్కడికి పోలీసులు చేరుకుని బారికేడ్లు పెట్టారు. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఏపీలో ఉద్యోగాల భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. నిరుద్యోగుల పక్షాన తాము పోరాడతామని షర్మిల అంటున్నారు.

Farmers Protest: చలో ఢిల్లీ నిరసనను 2 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాల ప్రకటన