కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు.. పార్టీని వీడుతున్న కీలక నాయకులు

లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.

కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు.. పార్టీని వీడుతున్న కీలక నాయకులు

Bihar two congress MLAs, RJD legislator quit parties ahead of Lok Sabha polls

Blow to Congress Party: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు. తాజాగా.. బీహార్‌లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక ఆర్జేడీ ఎమ్మెల్యే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు.. హిమాచల్ ప్రదేశ్‌లో సొంత పార్టీ ఎమ్మెల్యేల వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితికి వచ్చింది. అయితే.. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా మధ్యప్రదేశ్‌లో మాత్రం కమల్‌నాథ్ తాను కాంగ్రెస్‌ను వీడటం లేదని ప్రకటించడం ఆ పార్టీకి కాస్త రిలీఫ్‌నిచ్చింది.

బీహార్‌లో ఇండియా కూటమికి షాక్ ఇచ్చారు ముగ్గురు ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ఆర్జేడీ నుంచి ఒకరు పార్టీల ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్‌కు చెందిన మురారి ప్రసాద్‌గౌతమ్‌, సిద్ధార్థ్‌ సౌరవ్‌తో పాటు ఆర్జేడీకి చెందిన సంగీత కుమారి కమల దళంలో చేరిపోయారు. ఈ ముగ్గురు బీజేపీలో చేరడంలో బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరి కీలక పాత్ర పోషించారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉక్కిరిబిక్కిరి
తాజా రాజకీయ పరిణామాలతో హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ముగ్గురు స్వతంత్రులు క్రాస్ ఓటింగ్ చేయడంతో ఉన్న ఒక్క సీటు బీజేపీ ఖాతాలో చేరిపోయింది. సంఖ్యా బలం లేకపోయినా రాజ్యసభ పోటీలో నిలిచిన బీజేపీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడంలో విజయం సాధించింది.

Also Read: ఎన్నిసార్లు పిలిచినా.. ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు వెళ్లడం లేదు?

అయితే.. హిమాచల్‌ప్రదేశ్‌లో సుఖ్విందర్‌సింగ్‌ సుఖు నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారు ఏ క్షణమైనా కుప్పకూలిపోవచ్చని ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే బుధవారం నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే రెండేళ్లు తిరగకుండానే హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. దీంతో ఇప్పటి వరకు మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. కర్నాటక, తెలంగాణకు మాత్రమే పరిమితమవుతుంది.

Also Read: గాంధీ-నెహ్రూ కుటుంబ వారసులు యూపీలో గెలిచే పరిస్థితులు ఉన్నాయా?

బీజేపీలో చేరట్లేదన్న కమల్‌నాథ్
ఓవైపు బీహార్, హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ మాత్రం ఆ పార్టీకి ఊరటనిచ్చే మాట చెప్పారు. తాను బీజేపీలో చేరే వార్తలను కొట్టి పారేశారాయన. బీజేపీలో చేరికపై తాను ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని.. ఎవరితోనూ చెప్పలేదన్నారు కమల్‌నాథ్.