ARM Review : ARM మూవీ రివ్యూ.. ఓ దొంగ కథ.. కృతిశెట్టి ఫస్ట్ మలయాళం మూవీ ఎలా ఉందంటే?

ఒక విలువైన విగ్రహం కోసం ఒక దొంగ ఏం చేసాడు? ఎలా సాధించాడు అనే కథని, తన మనవడి కథకి లింక్ చేసి ఆసక్తికర స్క్రీన్ ప్లేతో చూపించారు.

ARM Review : ARM మూవీ రివ్యూ.. ఓ దొంగ కథ.. కృతిశెట్టి ఫస్ట్ మలయాళం మూవీ ఎలా ఉందంటే?

Tovino Thomas Krithi Shetty Malayalam Movie ARM Review and Rating

ARM Movie Review : మలయాళం స్టార్ టోవినో థామస్ హీరోగా నటించిన 50వ సినిమా ARM (అజాయంతే రాండం మోషణం తెలుగులో అజయ్ రెండో దొంగతనం అని అర్ధం). ఈ సినిమాలో టోవినో థామస్ మూడు పాత్రలు పోషించాడు. ఇందులో కృతి శెట్టి, ఐశ్వర్య లక్ష్మి, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటించారు. ARM సినిమాని పాన్ ఇండియా వైడ్ మళయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో నేడు సెప్టెంబర్ 12న రిలీజ్ చేసారు. ఇది కృతిశెట్టికి మొదటి మలయాళం సినిమా. ఈ సినిమాని లిస్టిన్ స్టీఫెన్ నిర్మాణంలో సుజిత్ నంబియార్ ఈ కథ, మాటలు రాయగా జితిన్ లాల్ తెరకెక్కించారు.

కథ విషయానికొస్తే.. ఈ కథ మూడు కాలాల్లో సాగుతుంది. కొన్నేళ్ల క్రితం రాజుల కాలంలో ఆకాశం నుంచి ఓ తోకచుక్క హరిపురం అనే ఊళ్ళో పడితే దాంట్లో ఉన్న పదార్థాలతో అక్కడి రాజు శ్రీభూతి దీపం అనే అమ్మవారి విగ్రహాన్ని తయారుచేస్తారు. దానికి చాలా మహిమలు ఉంటాయి. ఆ రాజుకి ఆపద వచ్చినప్పుడు హరిపురం యోధుడు కుంజికేలు(టోవినో థామస్) రాజుని కాపాడి బహుమానంగా ఆ దీపాన్ని అడగడంతో ఇస్తాడు. ఆ విగ్రహాన్ని చియోతి కావులో గుడి కట్టి ప్రతిష్టిస్తారు. అనుకోకుండా కుంజికేలు మరణిస్తాడు.

కొన్నేళ్ల తర్వాత చియోతి కావు ఊళ్ళోనే అజయ్(టోవినో థామస్) ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ బతుకుతాడు. ఆ ఊరి పెద్ద నంబియార్ కూతురు లక్ష్మి(కృతిశెట్టి)ని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ అజయ్ ఆ ఊరి గజదొంగ మనియన్(టోవినో థామస్) మనవడు అని చిన్నచూపు చూస్తూనే, ప్రతి దొంగతనానికి అనుమానిస్తూ ఉంటారు ఊరివాళ్ళు. ఓ సమయంలో రాజ వంశానికి చెందిన సుదేవ్(హరీష్ ఉత్తమన్) వచ్చి ఆ గుళ్లో విగ్రహం దొంగలించి అది డూప్లికేట్ అని, ఒరిజినల్ మీ తాత దొంగలించాడని అది వెతికి పెట్టకపోతే నిన్ను నిజంగా దొంగని చేస్తాను అని, గుడి ఉత్సవం రోజు తలుపులు తెరిచేలోపు విగ్రహం కనిపెట్టకపోతే గుడిలో విగ్రహం దొంగవి నువ్వే అవుతావని అజయ్ ని ఇరికించడంతో అజయ్ వాళ్ళ తాత దాచిన అసలు విగ్రహం కోసం వెతుకుతూ ఉంటాడు. అసలు గుడిలోకి డూప్లికేట్ విగ్రహం ఎలా వచ్చింది? మనియన్ ఎలా ఒరిజినల్ విగ్రహం రాజ మందిరం నుంచి కొట్టేసాడు? ఎందుకు కొట్టేసాడు? గజదొంగ మనియన్ ఎలా చనిపోయాడు? గజదొంగ మనియన్ కథేంటి? వీరుడు కుంజికోలు ఎలా మరణించాడు? అజయ్ ప్రేమ కథ ఏమైంది? అజయ్ ఒరిజినల్ విగ్రహాన్ని కనిపెట్టడా? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : NTR fan : దేవ‌ర సినిమా చూసే వ‌ర‌కు బ‌తికించండి.. బ్ల‌డ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్ వేడుకోలు

సినిమా విశ్లేషణ.. ఈ సినిమా చూస్తుంటే మన తెలుగులో తీసిన సాహసం, అంజి లాంటి సినిమాలు గుర్తొస్తాయి. అయితే అవి హీరోల నేపథ్యంలో చూపిస్తే ఇది ఒక దొంగ కథగా చూపించారు. పీరియాడిక్ సోషియో ఫాంటసీ యాక్షన్ సినిమాలా ARM ని తెరకెక్కించారు. ఒక విలువైన విగ్రహం కోసం ఒక దొంగ ఏం చేసాడు? ఎలా సాధించాడు అనే కథని, తన మనవడి కథకి లింక్ చేసి ఆసక్తికర స్క్రీన్ ప్లేతో చూపించారు. మూడు కాలాల్లో జరిగిన ఈ కథల్లో వీరుడు కుంజికేలు కథని, ఆ విగ్రహం గురించి ముందు 20 నిమిషాల్లో చూపించేస్తారు.

ఆ తర్వాత నుంచి అజయ్ కథని నడిపిస్తూ మధ్యమధ్యలో గజదొంగ మనియన్ కథని చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్, క్లైమాక్స్ మాత్రం ఆసక్తిగా సాగుతుంది. మనియన్ విగ్రహం కోసం వెళ్లిన ఆ సీన్స్ అన్ని సాహసం, అంజి సినిమాల క్లైమాక్స్ లను గుర్తుచేస్తాయి. ఇక అజయ్ విగ్రహం వెతుకులాట కూడా ఆసక్తిగానే ఉంటుంది. కానీ సినిమాలో మలయాళం ఫ్లేవర్ క్లియర్ గా కనిపిస్తుంది. పూర్తిగా మలయాళం సినిమాగా తీసి కేవలం డబ్బింగ్ మాత్రమే చేసి రిలీజ్ చేసారు. మరి ఇది తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాని 3D లో కూడా రిలీజ్ చేసారు.

Tovino Thomas Krithi Shetty Malayalam Movie ARM Review and Rating

నటీనటుల పర్ఫార్మెన్స్.. టోవినో థామస్ ఇప్పటికే తన మలయాళ సినిమాలతో బెస్ట్ యాక్టర్ గా పలు అవార్డులు కూడా అందుకున్నాడు. ఈ సినిమాలో మూడు పాత్రల్లోనూ టోవినో థామస్ అదరగొట్టాడని చెప్పొచ్చు. ముఖ్యంగా మనియన్ దొంగ పాత్రలో బాగా నటించాడు. ఈ సినిమా కోసం కేరళ విద్య కళరి కూడా నేర్చుకొని కష్టపడ్డాడు. ఇక కృతిశెట్టికి ఇది మొదటి మలయాళం సినిమా. కానీ సినిమాలో మాములు ప్రేయసి పాత్రే. రొటీన్ క్యారెక్టర్ అయినా తన అందచందాలతో మెప్పించింది కృతి. ఐశ్వర్య లక్ష్మి కాసేపే కనిపించి మెప్పించింది. మనియన్ భార్య పాత్రలో సురభి లక్ష్మి అదరగొట్టింది. హరీష్ ఉత్తమన్, రోహిణి, మాల పార్వతి.. మిగిలిన నటీనటులంతా వారి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. మూడు కాలాలకు తగ్గట్టు, లొకేషన్స్ కి తగ్గట్టు విజువల్స్ చాలా బాగా చూపించారు. లొకేషన్స్ చాలా బాగా వెతికి పట్టుకున్నారు కథకు తగ్గట్టు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగా కష్టపడింది. కొన్ని యాక్షన్స్ సీక్వెన్స్ లు బాగా డిజైన్ చేసారు. జితిన్ లాల్ దర్శకుడిగా మొదటి సినిమా అయినా సక్సెస్ అయ్యాడు. ఎడిటింగ్ లో మాత్రం కాస్త సాగదీసిన సన్నివేశాలు తగ్గించి ఉంటే బాగుండేది. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై తెలుస్తుంది.

మొత్తంగా ARM సినిమా ఒక విలువైన విగ్రహం చుట్టూ మూడు పాత్రలతో తిరిగే ఆసక్తికరమైన కథ. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.