Sitaram Yechury: సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రముఖుల సంతాపం

సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు.

Sitaram Yechury: సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Sitaram Yechury Passed Away

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్‌లో స్పందిస్తూ.. సీతారాం ఏచూరి తనకు మిత్రుడని, దేశ భావజాలానికి రక్షకుడని, మన దేశం గురించి లోతైన అవగాహన ఉన్న వ్యక్తి అని చెప్పారు. ఆయనతో సుదీర్ఘ చర్చలను చేసే అవకాశాన్ని కోల్పోతున్నానని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.

నాతో చర్చించే వారు: బండారు దత్తాత్రేయ
ఏచూరి మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. ఆయన మరణ వార్త తనకు చాలా దుఃఖాన్ని, బాధను కలిగించిందని తెలిపారు. వారు తనకు అత్యంత ఆత్మీయ సన్నిహితులని, చిన్న వయస్సులోనే సి.పి.ఎం పార్టీలో సైద్ధాంతిక బలంతో తర్కబద్దంగా విషయాలను చక్కగా వివరించే మేధావి అని, తాను కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు తాము అనేక సార్లు కలుసుకున్నామని అన్నారు. రాజ్యసభలో తాను ప్రశ్నలకు జవాబులు చెబుతున్నప్పుడు వారు కొన్నిసార్లు మద్దతు తెలిపారని, తాను కార్మిక శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు కార్మికుల గురించి తనతో చర్చించేవారని తెలిపారు.

నారా లోకేశ్ సంతాపం
ప్రజాపోరాట యోధుడిని కోల్పోయామని, ఆయన మృతి తీవ్ర విషాదాన్ని నింపిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ప్రజా ఉద్యమాలకే జీవితాన్ని అంకితం చేసిన వారికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. అమర్ రహే కామ్రేడ్ సీతారాం ఏచూరి అని పేర్కొన్నారు.

కేసీఆర్ దిగ్భ్రాంతి

సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి, విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీ కి కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా అంచలంచలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని అన్నారు. సీతారాం ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి, లౌకిక వాదానికి తీరని లోటని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఏచూరి మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భట్టి విక్రమార్క స్పందన
సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అకాలమరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.

తీరని లోటు: మహేశ్ కుమార్ గౌడ్

ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక వేత్త, మేధావి ఏచూరి సీతారాం మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటని అన్నారు. తెలుగు వాడిగా తన రాజకీయ వాణిని జాతీయ స్థాయిలో వినిపిస్తూ, అద్భుతమైన ప్రతిభ చూపిన గొప్ప నాయకులు ఏచూరి అని, ఆయన మరణం దేశ రాజకీయాలకు లోటని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసిన యోధుడు ఏచూరి అని, పేదల కోసం తన జీవితాంతం ఉద్యమాలు చేసిన ఏచూరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.

Also Read: ఇది హేయమైన చర్య.. వారిద్దరి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాలి: మందకృష్ణ మాదిగ