రాజధానిలో ఆందోళనలు 32వ రోజు..బాబు మరో యాత్ర

  • Published By: madhu ,Published On : January 18, 2020 / 01:33 AM IST
రాజధానిలో ఆందోళనలు 32వ రోజు..బాబు మరో యాత్ర

రాజధాని తరలింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతిలో ఆందోళనలు 32వ రోజుకు చేరాయి. అన్ని గ్రామాల్లో ప్రజలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2020, జనవరి 18వ తేదీ శనివారం టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా జేఏసీ నేతలు పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్ర చేపట్టనున్నారు.

రాజధాని తరలింపుపై నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్‌తోపాటు అసెంబ్లీ భేటీకి సమయం సమీపిస్తున్న తరుణంలో అమరావతి గ్రామాల్లో ఉద్యమం ఉధృతమైంది. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలతో రైతులు హోరెత్తిస్తున్నారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు ప్రాంతాల్లో ఆందోళనలు మిన్నుముట్టాయి. అమరావతి పరిధిలోని మంగళగిరిలో పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం బైక్‌ ర్యాలీ జరిగింది.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్‌ తన బైక్‌పై కూర్చో బెట్టుకుని ర్యాలీగా వెళ్లారు. సీతారామ జంక్షన్‌ నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు జరిగిన ఈ ర్యాలీలో రాజధాని పరిధిలోని పలు గ్రామాల రైతులు పొల్గొని నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అమరావతికి ఒప్పుకుని.. ఇప్పుడు మార్చాలన్న జగన్‌ ప్రతిపాదనపై లోకేశ్‌ మండిపడ్డారు.

ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారిస్తే ప్రజలపై అదనపు భారం పడుతుందని, అభివృద్ధి ఆగిపోతుందని విమర్శించారు. రాజధాని తరలింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈనెల 20 జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని సీపీఐ నేత నారాయణ పిలుపు ఇచ్చారు. 

Read More : CRDA కార్యాలయానికి రైతుల క్యూ