జగన్‌ని వదిలేసి చంద్రబాబుని ఎక్కువగా టార్గెట్ చేశారు.. ఇక బీజేపీ, టీడీపీ దోస్తీ కుదరని పనేనా?

  • Published By: naveen ,Published On : August 26, 2020 / 01:48 PM IST
జగన్‌ని వదిలేసి చంద్రబాబుని ఎక్కువగా టార్గెట్ చేశారు.. ఇక బీజేపీ, టీడీపీ దోస్తీ కుదరని పనేనా?

రెండున్నరేళ్ల క్రితం వరకూ కలసి రాజకీయ ప్రయాణం సాగించిన తెలుగుదేశం, బీజేపీలు ఇప్పుడు బద్ధ విరోధులుగా మారాయి. అవసరం ఉన్నప్పుడు కలిసిపోవడం, తర్వాత ఘర్షణ పడటం ఈ రెండు పార్టీలకు అలవాటేనని అందరూ అంటూ ఉంటారు. టీడీపీ స్థాపించిన తర్వాత నుంచి ఇప్పటి వరకూ పూర్తయిన 38 ఏళ్లలో బీజేపీతో కలవడం.. మళ్లీ విడిపోవడం కామన్‌గానే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవంటున్నారు. ఈ రెండు పార్టీలు మరోసారి కలిసేందుకు ఇప్పట్లో వీలు పడకపోవచ్చని అంచనా వేస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పుకోవచ్చు.



బీజేపీతో సయోధ్యకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు:
ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం.. ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం అయింది. గత ఎన్నికల్లో 23 అసెంబ్లీ స్థానాలు మాత్రమే సాధించింది. దీంతో ఆ పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అవసరం చాలా ఉందంటున్నారు. అందుకే ఎలా అయినా సరే బీజేపీతో కలిసిపోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. అధినేత చంద్రబాబు తన శక్తి యుక్తులన్నింటినీ ఉపయోగించి బీజేపీతో సయోధ్య కోసం ప్రయత్నాలు ప్రారంభించారట. ఎలాగైనా అంతా సెట్ అవుతుందని అందరూ భావించారు. కానీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు వ్యతిరేకులు పూర్తి స్థాయిలో బీజేపీ హైకమాండ్ దగ్గర పట్టు సాధించారని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు ప్రయత్నాలు వర్కవుట్ అయినట్టు కనిపించడం లేదట.

వీర్రాజు రాకతో టీడీపీ సినిమా అయిపోనట్టే:
రాష్ట్రంలో మొన్నటి వరకూ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను ఆ పదవి నుంచి తప్పించి సోము వీర్రాజుకు బాధ్యతలు అప్పగించడంతో టీడీపీకి సినిమా అర్థమైపోయిందని అంటున్నారు. ఇప్పుడు బీజేపీ నేతలంతా టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే టీడీపీ నేతలు బీజేపీని విమర్శించకపోయినా, బీజేపీ నేతలు మాత్రం టీడీపీని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు గుప్పిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు తెగ ఫీలైపోతున్నారట. వైసీపీ నేతలను విమర్శిస్తే బీజేపీ నేతలకొచ్చిన బాధ ఏంటో అర్థం కావటం లేదంటున్నారు టీడీపీ నేతలు.
https://10tv.in/bjp-following-different-policies-based-on-state-situation/
ఆ ముగ్గురు బీజేపీ నేతలు టీడీపీని విమర్శించడానికే ఉన్నారా:
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ వైఖరిపై టీడీపీ లోలోన రగిలిపోతోంది. కానీ, పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం బీజేపీకి దగ్గరయ్యేందుకు ఇంకా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారట. రాష్ట్రంలో ఉన్న సీనియర్ నేతలు మాత్రం బీజేపీని టార్గెట్ చేయాల్సిందే అంటూ కాస్త సీరియస్ అవుతున్నారట. ముఖ్యంగా కొందరు బీజేపీ నేతలు వైసీపీ మౌత్ పీసుల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కొత్తగా అధ్యక్షుడైన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు కేవలం టీడీపీని విమర్శించడానికే ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారని రగిలిపోతున్నారు.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో జీవీఎల్ జోక్యంపై టీడీపీ నేతల ఆగ్రహం:
ఈ మధ్యకాలంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో చంద్రబాబు ప్రధానికి లేఖ రాస్తే జీవీఎల్ జోక్యం చేసుకోవడాన్ని టీడీపీ తప్పు పడుతోంది. రాష్ట్రంలో బీజేపీలోని కొందరు నేతలు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారో తెలుసుకోవాలని టీడీపీ నేతలు అంటున్నారు. పార్టీ అధినేత మాత్రం బీజేపీతో స్నేహం కోసం ఇంకా ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారట. కొత్తగా అధ్యక్షుడైన సోము వీర్రాజు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబును ప్రధానంగా టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారని అంటున్నారు టీడీపీ నేతలు.

టీడీపీ ఆశలు ఆవిరి:
సార్వత్రిక ఎన్నికలు ముగిసి 15 నెలలైంది. అప్పటి నుంచి బీజేపీని ఏనాడూ టీడీపీ గట్టిగా విమర్శించిన సందర్భాలు లేవని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు అయితే ఏకంగా ప్రధానికి లేఖలు రాస్తూ బీజేపీ వైఖరిని అనేక సందర్భాల్లో సమర్ధిస్తున్నారు. రెండు పార్టీల మధ్య గ్యాప్‌ తగ్గించేందుకు ఇవన్నీ దోహదం చేస్తాయని ఆశిస్తున్నారు. ఇన్ని రోజులుగా టీడీపీ నేతలు అదే ఆశతో ఎదురు చూశారు. కానీ ప్రస్తుతం మాత్రం అలాంటి ఆశలేవీ వారిలో కనిపించడం లేదంటున్నారు.

బీజేపీ విమర్శలకు కౌంటర్లు ఇవ్వాల్సిందే అంటున్న సీనియర్లు:
ప్రస్తుతం బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను లైట్‌ తీసుకుంటే రాజకీయంగా పార్టీకి ఇబ్బంది తప్పదని హెచ్చరిస్తున్నారట. ఇక నుంచి బీజేపీ నేతల విమర్శలకు కౌంటర్లు ఇవ్వాల్సిందేనని సీనియర్‌ నేతలు కొందరు అధినేతతో చెబుతున్నారట. పార్టీ నాయకులు, కేడర్ మాత్రం బీజేపీతో ఇక సెట్ అవ్వదని డిసైడ్ అయ్యారు. అధినేత మాత్రం అలుపెరుగని పోరాట యోధుడిలా ఇంకా తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారట. మరి ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరి, దగ్గరవుతాయో లేవో కాలమే నిర్ణయిస్తుందని మరికొందరు అంటున్నారు.