తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్, టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్, టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

vaccine in Telugu states : తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్‌ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి‌. ఏపీలో వ్యాక్సిన్‌ పంపిణీని సీఎం జగన్‌ ప్రారంభించనుండగా.. తెలంగాణలో గవర్నర్‌ తమిళిసై, మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించనున్నారు. ఏపీ వ్యాప్తంగా 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలి విడతలో రాష్ట్రంలో సుమారు 3 లక్షల 80 వేల మంది వైద్య, ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేయనున్నారు. 332 కేంద్రాలకు గాను తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 33 కేంద్రాలు, విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియను సీఎం జగన్‌ పరిశీలించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆన్‌లైన్‌లో కొందరు లబ్దిదారులతో ఇంటరాక్ట్‌ అయ్యే అవకాశం ఉంది. దీనికి తగ్గట్లు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇటు తెలంగాణలో 139 సెంటర్లలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ లాంఛనంగా ప్రారంభం కానుంది. దీన్ని త్వరలోనే 1,213 సెంటర్లకు విస్తరించనున్నారు. నిమ్స్‌లో గవర్నర్‌ తమిళిసై, గాంధీ ఆస్పత్రిలో మంత్రి ఈటల వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 3.15 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్‌కేర్‌ వర్కర్ల వివరాలను కో-విన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసినట్లు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌ తెలిపారు.

శనివారం ఒక్కో వ్యాక్సినేషన్‌ కేంద్రంలో 30 మందికి చొప్పున ఆరోగ్య సిబ్బందికి టీకా వేయనున్నట్లు తెలిపారు. వారంలో నాలుగు రోజులు కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. గాంధీ ఆస్పత్రితో పాటు, రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ను ప్రధాని మోదీ ఆన్‌లైన్‌ ద్వారా పరిశీలించనున్నారు. లబ్దిదారులతో మాట్లాడే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్‌ కోసం వచ్చే సిబ్బందికి ముందుగానే కొవిన్‌ యాప్‌ ద్వారా సమాచారం పంపారు. వైద్య సిబ్బంది గుర్తింపు కార్డులు వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వ్యాక్సిన్‌ ప్రక్రియను కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షించనున్నారు.