విశాఖ ఉక్కు, ప్రైవేటుకు దక్కు!

విశాఖ ఉక్కు, ప్రైవేటుకు దక్కు!

vizag steel plant : విశాఖ ఆయువుపట్టు సడలుతోందా? ఉక్కు పిడికిలి బిగించి తెలుగు వాడు సాధించిన ఉక్కు కర్మాగారం ఉట్టిదైపోతోందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి కేంద్రంగా నిలిచిన ఉక్కు పరిశ్రమ.. పెట్టుబడుల ఉపసంహరణ వేటలో చిక్కిశల్యమైపోతోందా? తాజా పరిణామాలను గమనిస్తే.. ఇదే నిజమనిపిస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను వంద శాతం ప్రయివేటీకరిస్తున్నట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే చేసిన ట్వీట్ ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఆరు దశాబ్దాలుగా విశాఖ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఉక్కు పరిశ్రమ మనుగడపై… పాండే ట్వీట్‌తో నీలినీడలు కమ్ముకున్నాయి.

విశాఖ ఉక్కు కర్మాగారం…. స్వాతంత్ర్యానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన అతి పెద్ద ఫ్యాక్టరీ. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని తెన్నేటి విశ్వనాథం ఆధ్వర్యంలో తెలుగు వారు చేసిన నినాదాలు అలల ఘోషతో పోటీపడ్డాయి. రాజీపడని, అలుపెరగని ఆ పోరాటం సాగరతీరాన తొలి ఉక్కుకర్మాగారానికి పురుడు పోసింది. కేంద్రం పూర్తిస్థాయి నిధులతో నిర్మాణమైన ఆ కర్మాగారం…విశాఖ రూపురేఖలను మార్చివేసింది. లక్షలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించింది. స్టీల్ ప్లాంట్ కేంద్రంగా అభివృద్ధి ప్రారంభమై…రాష్ట్రమంతా విస్తరించింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచింది. స్టీల్‌ ప్లాంట్‌ను, విశాఖను విడదీసి చూడలేం. ఉక్కు ఫ్యాక్టరీతో విశాఖ ఉక్కు నగరంగా మారింది. వైజాగ్ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది ఫ్యాక్టరీ.

ఆంధ్రుల పోరాటంతో 1971లో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. 22వేల ఎకరాల సువిశాల స్థలంలో ఫ్యాక్టరీ నిర్మించారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో 18వేలమంది శాశ్వత ఉద్యోగులు, 20వేల మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. ఫ్యాక్టరీ నిర్మితమైన తొలి సంవత్సరాల్లో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంది. తర్వాతికాలంలో ఆ ఇబ్బందులను అధిగమిస్తూ..ఎవరూ ఊహించనిరీతిలో అభివృద్ధి చెందింది. 2002వ సంవత్సరం నుంచి 2015 వరకు కోట్ల రూపాయల లాభాలు ఆర్జించింది. 2003 నుంచి 2009 వరకు ఏటా వెయ్యికోట్లకు పైగా లాభాలు నమోదు చేసింది. అయితే 2015 తర్వాత మూడేళ్ల పాటు ఉక్కు ఫ్యాక్టరీని నష్టాలు వెంటాడాయి. తర్వాతి ఏడాది 2018-19లో మాత్రం 97కోట్ల లాభం సాధించింది. కానీ గడచిన ఆర్ధిక సంవత్సరంలో స్టీల్ ప్లాంట్ భారీ నష్టాలు చవిచూసింది. ఈ ఒక్క ఏడాదే 3వేల కోట్లకు పైగా నష్టం నమోదు చేసింది.

స్టీల్ ప్లాంట్ నష్టాలకు ప్రధాన కారణం సొంత గనులు లేకపోవడం. ముడి ఇనుము, బొగ్గు ధరలు భారీగా పెరగడంతో కొనుగోళ్లకు అధికమొత్తంలో ఖర్చుచేయాల్సి రావడం స్టీల్‌ప్లాంట్‌పై పెనుభారం మోపుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆధునికీకరణ, విస్తరణ వల్ల కూడా ఆర్ధిక ఇబ్బందులు పెరిగాయి. దీనికి తోడు ఉక్కు కర్మాగారాన్ని పోస్కో సెగలు కూడా తాకాయి. ప్రపంచ ఉక్కు దిగ్గజ సంస్థ అయిన పోస్కో తమ కార్మాగారాన్ని స్టీల్ ప్లాంట్ ఆవరణలో నిర్మిస్తుందన్న ప్రచారం జరిగింది. పోస్కో ప్రతినిధులు కొందరు స్టీల్‌ప్లాంట్‌ను పలుమార్లు సందర్శించడం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. స్టీల్ ప్లాంట్ కింద ఉన్న కొన్ని ఎకరాలను పోస్కోకు కేటాయిస్తారన్న వార్తలపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమయింది. ఈ వివాదం సాగుతుండగానే…నెత్తిమీద పిడుగులా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం ప్రకటించింది.

విశాఖ ఉక్కుఫ్యాక్టరీపై ఉన్న యాజమాన్యం హక్కులను వదులుకుని వంద శాతం ప్రయివేటీకరిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కమిటీ ఇందుకు ఆమోదముద్ర వేసిందని తుహిన్ కాంత పాండే తెలిపారు. ప్రయివేటీ కరణ ద్వారా విశాఖ ఉక్కు యాజమాన్య హక్కులతో పాటు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వందశాతం షేర్ హోల్డింగ్‌ను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.