Amphan Toofan : ఏపీకి తప్పిన గండం

  • Published By: madhu ,Published On : May 21, 2020 / 01:49 AM IST
Amphan Toofan : ఏపీకి తప్పిన గండం

అతి తీవ్ర తఫాను అంపన్‌  తీరం దాటడంతో ఏపీకి ముప్పు తప్పింది. తుపాన్‌ తీరం దాటినందున ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు తొలగించారు. ఈ తుపాన్‌ విశాఖ తీరానికి 401 కిలోమీటర్ల నుంచి 470 కిలోమీటర్ల దూరం మధ్య సముద్రంలో పయనించినట్టు అధికారులు తెలిపారు. తుపాన్‌ కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, పోలాకి, గార, కవిటి, ఇచ్ఛాపురం, రణస్థలం ప్రాంతాల్లో సముద్ర కెరటాలు ఎగిసిపడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో బియ్యం లోడింగ్‌కు బ్రేక్‌ పడింది.

బెంగాల్ ను తాకిన తుపాన్ : –
అతి తీవ్ర తుపాన్‌ అంపన్‌… పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో తీరాన్ని దాటింది. 2020, మే 20వ తేదీ బుధవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్యనున్న సుందరబన్‌ ప్రాంతానికి దగ్గరగా తుపాన్‌ తీరాన్ని తాకినట్టు IMD వెల్లడించింది. సాయంత్రం 7 గంటలకు తీరాన్ని దాటినట్టు తెలిపింది. ఈ సమయంలో భీకర గాలులు వీశాయి. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీశాయి.

బెంగాల్ ను తాకిన తుపాన్ : –
అంపన్‌ తుపాన్‌ వల్ల పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా, ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయ.  ఇక ఒడిశాలోని పూరి, ఖుద్రా, జగత్‌సింగ్‌పూర్‌, కటక్‌, కేంద్రపారా, జాజ్‌పూర్‌, గంజామ్‌, భద్రక్‌, బాలాసోర్‌ తదితర జిల్లాలపై తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా పడింది. ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో భారీ వృక్షాలు వేళ్లతో సహా పెకిలించుకొని నేలకొరిగాయి. స్తంభాలు విరిగిపడ్డాయి. పెద్ద మొత్తంలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందలాది ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వృక్షాలు కార్లపై పడటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. రోడ్లు బీటలు వారాయి. హౌరా జిల్లా మణికాన్‌లో భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా నేలకొరిగాయి. ఈ సమయంలో ఆయా చెట్ల కింద ఉన్న ఇద్దరు మహిళలు మృతి చెందారు. తుపాన్‌ ధాటికి ఒడిశాలో మరో ఇద్దరు మృతి చెందారు. 

కోల్ కతాపై తుపాన్  : –
బెంగాల్‌ రాజధాని కోల్‌కతాపై తుపాన్‌ ప్రభావం ఎక్కువగా పడింది. భారీ ఈదురుగాలులు, కుంభవృష్టి వర్షాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఒడిసాలో రాత్రి నుంచి పరిస్థితి మరింత తీవ్రమయ్యింది. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి 6 లక్షల 58వేల  మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బెంగాల్‌, ఒడిశా తీర ప్రాంతాల్లోని దాదాపు 6 లక్షల 58 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు డిజాస్టర్‌ దళాలు సహాయక చర్యలు అందించాయి. మొత్తం 41 బృందాల్ని సహాయ చర్యలు నిర్వహించడానికి రెండు రాష్ర్టాల్లో మోహరించారు.

అంధకారంలో 10 లక్షల మంది : –
తుపాన్‌ సృష్టిస్తున్న ప్రఛండ గాలులతో పశ్చిమ బెంగాల్‌కు ఆనుకొని ఉన్న సముద్ర జలాల్లోని అలలు ఐదు మీటర్ల ఎత్తుతో ఎగసిపడ్డాయి. తుపాన్‌ ప్రభావంతో పెద్దమొత్తంలో పంటలు పూర్తిగా నాశనం అయ్యాయి. పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. అసోం, మేఘాలయలో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు అంపాన్‌ తుపాన్‌ బంగ్లాదేశ్‌ వైపునకు వెళ్లాక తీవ్ర వాయుగుండంగా మారి ఆ తర్వాత బలహీనపడనున్నట్టు అధికారులు  తెలిపారు. తుపాన్‌ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 20 లక్షల మంది ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈదురు గాలుల వల్ల విద్యుత్‌ వైర్లు తెగిపోవడంతో ఆ దేశంలో 10లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. 

ఈ ఏడాది తుపాన్ : –
అంపన్.. ఈ ఏడాది సంభవించిన తొలి తుపాను. బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను కుదిపేసింది. తొలుత నెమ్మదిగా ప్రారంభమైన అంఫన్.. చూస్తుండగానే పెను తుఫానుగా పరిణామం చెందింది. 1999 తరువాత ఒడిశా ఎదుర్కొన్న పెను తుపాను కూడా ఇదే. ఒకానొక సమయంలో తుపాన్‌ గాలులు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో వీచాయి. అయితే అదృష్టవశాత్తూ తీరం దాటే సమయానికి అంఫన్ శాంతించడంతో గాలుల వేగం 160కిలోమీటర్లకు పరిమితమైంది. అంఫన్… అంత వేగంగా పెనుతుఫానుగా మారడానికి పర్యారవణ మార్పులే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వేడెక్కిన జలాలు : –
వేడెక్కుతున్న సముద్ర జలాల కారణంగా అంఫన్ చాలా తొందరగా పెను తుపానుగా మారిందని అంటున్నారు. కేవలం 24 గంటల్లోనే కేటగిరీ 1 నుంచి కేటగిరీ 5 పెను తుపానుగా మారిందన్నారు. ఈ పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదని వారన్నారు. వేడెక్కిన జలాలు పెను తుపానులకు దారి తీస్తాయని, పర్యవరణవరణ మార్పులు తీసుకొచ్చే ప్రతికూల ఫలితాలకు ఇదో ఉదాహరణ అని వారు చెబుతున్నారు. (Amphan Toofan : విశాఖలో పెరగనున్న ఎండలు)