హోటల్స్, రెస్టారెంట్స్‌లో డర్టీ పిక్చర్.. అపరిశుభ్ర వాతావరణంలో వంట, కుళ్లిన మాంసంతో బిర్యానీ, హానికరమైన కెమికల్స్

  • Published By: naveen ,Published On : November 7, 2020 / 02:55 PM IST
హోటల్స్, రెస్టారెంట్స్‌లో డర్టీ పిక్చర్.. అపరిశుభ్ర వాతావరణంలో వంట, కుళ్లిన మాంసంతో బిర్యానీ, హానికరమైన కెమికల్స్

hotels restaurants dirty picture: కుదిరితే కుటుంబసమేతంగా.. వీలైతే ఫ్రెండ్స్‌తో సరదాగా.. హోటల్‌కి రెస్టారెంట్లకి వెళ్తున్నాం. వాళ్లు వడ్డించింది తినేసి వస్తున్నాం. కానీ అది ఎంత దరిద్రమైన వాతావరణంలో చేస్తున్నారో తెలుసా..? ఎన్ని రోజులు నిల్వ చేసిన మాంసాన్ని వండి పెడుతున్నారో గమనించారా..? ఇవన్నీ తెలిస్తే మీరు హోటల్‌కి వెళ్లాలంటేనే జడుసుకుంటారు.

అపరిశుభ్ర వాతావరణంలో, పాచిన మాంసంతో వంటలు:
చికెన్‌, మటన్‌, ప్రాన్స్‌, ఫిష్‌ బిర్యానీ… వీటిని చాలామంది ఇష్టంగా తింటారు. నిజానికి బిర్యానీ పేరెత్తితే చాలూ.. నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. బిర్యానీ పేరు చెబితే చాలు విదేశీయులు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. అంత‌టి ఖ్యాతి మన బిర్యానీకి ఉంది. అయితే ఇదే పేరు అడ్డం పెట్టుకుని కొంద‌రు హోట‌ల్స్‌, రెస్టారెంట్స్ య‌జ‌మానులు లాభాపేక్షతో వ్యవహరిస్తున్నారు. రోజుల త‌ర‌బ‌డి ఫ్రిజ్ లో అహార పదార్థాలను నిల్వ చేస్తున్నారు. మాంసానికి మసాలాలు దట్టించి బిర్యానీతో ఇతర వెరైటీలు వండుతున్నారు. మసాలాల ఘాటు మాటున జనమంతా పాచిపోయిన పదార్థాలనే ఆబగా తినేస్తున్నారు. స్పాట్..

కుళ్లిపోయిన మాంసాన్ని ఫ్రిజ్ లో నిల్వ చేసి వంటలు:
చాలా హోటళ్లలో వారం రోజుల కిందటి కుళ్లిపోయిన మాంసాన్ని నిల్వ చేస్తున్నారు. ఇవాళ వండిన కూరలు మిగిలిపోతే చెడిపోకుండా ఫ్రిజ్‌లో పెట్టేస్తున్నారు. మరుసటి రోజు వేడి చేసి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు. కిచెన్‌లో పురుగులు తిరుగుతున్నా.. ఈగలు వాలుతున్నా పట్టించుకోవడం లేదు. అపరిశుభ్ర వాతావరణంలోనే వంటశాలలో గరిటె తిప్పేస్తున్నారు. అప్పుడప్పుడు అధికారులు చేస్తున్న తనిఖీల్లో మాత్రమే కంపు వ్యవహారాలు బయటికొస్తున్నాయి.

ఫ్రీజ్ చేసిన మాంసాహారం, బిర్యానీలకు స్టైలిష్ డెకరేషన్స్ చేసి ఆఫర్లు పెట్టి అమ్మకం:
బిర్యానీ పేరెత్తితే చాలు.. కొంతమంది కుమ్మేస్తుంటారు. కానీ తినే బిర్యానీ మంచిదేనా..? అందులో వాడిన మాంసం ఎన్ని రోజులు అవుతుందో ఎవ్వరూ పట్టించుకోరు. అదే నిర్వాహకులకు వరంగా మారుతోంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడన్నట్టు.. వేడివేడిగా వడ్డిస్తే తమనెవరు పట్టుకుంటారులే అన్న ధీమాతో బరితెగిస్తున్నారు. కొన్ని హోటళ్లలో రోజుల తరబడి నెలల తరబడి ఫ్రీజ్ చేసిన మాంసాహారం, బిర్యానీలకు స్టైలిష్ డెకరేషన్స్ చేసి ఆఫర్లు పెట్టి అమ్మేస్తున్నారు. పెద్దగా పట్టించుకోని ఆహార ప్రియులు వేడి వేడి విందు భోజనాలను ఆర్డర్స్ ఇస్తూ మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు.


ఆకర్షణీయంగా కనిపించేందుకు హానికరమైన రంగులు:
హోటళ్లలో కుళ్లిన మాంసం పదార్థాలు.. నిల్వ ఉంచిన బిర్యానీ, కోడి మాంసం, చేపలు, రొయ్యలు, తందూరి చికెన్‌, వెజ్‌ మంచూరియా లాంటి వంటకాలు రెండు, మూడు రోజులకు పైబడి ఫ్రిజ్‌లలో నిల్వచేసి విక్రయిస్తున్నారు. కుళ్లిన క్యాబేజీ, ఉల్లిపాయలు, క్యారెట్‌లతో పాటు పాడైపోయిన మసాలా, ధనియాల పొడి లాంటి పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఆకర్షణీయంగా కనిపించేందుకు హానికరమైన రంగులను వాడుతున్నారు. వాటితోనే ఆహార పదార్ధాలను తయారు చేస్తున్నారు. వ్యాపారం పేరుతో ప్రజా ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కాసులకు కక్కుర్తికి ఎగబడుతున్నారు.

బయటపడ్డ కోడి, రొయ్యలు, పొట్టేలు మాంసం.. ప్రమాదకర బ్యాక్టీరియా ఉందనే అనుమానాలు:
ఆ మధ్య నెల్లూరు జిల్లాలోని సింహపురి రుచులు, బిర్యానీ హౌజ్‌ హోటళ్లపై అధికారులు మెరుపు దాడులు చేశారు. ఫ్రిజ్‌లలో తీసేకొద్దీ బూజు పట్టి, రంగులు పూసిన మాంసం బయట పడింది. స్టోర్ చేసిన కోడి, పొట్టేలు మాంసం, రొయ్యలు, చేపలు బయటపడ్డాయి. ఇక పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో విక్రయించే ఆహారంలో కూడా ప్రమాదకర బ్యాక్టీరియా ఉందనే వాదనలున్నాయి. కొన్ని హోటళ్లలో రుచి కోసం రసాయనాలతో కూడిన పదార్థాలను కూడా ఉపయోగిస్తున్నారు. కెమికల్స్‌తో కూడిన ఆహారం తీసుకుంటే కేన్సర్, అల్సర్, ఊబకాయం, జీర్ణాశయ సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది.

కుళ్లిన వాసన భరించలేక వాంతులు:
అన్ని హోటళ్లు ఒకేలా ఉంటాయని కాదు కానీ చాలా హోటళ్లలో మాత్రం ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. కొన్ని హోటళ్లు వారం రోజులకు పైగా నిల్వ ఉన్న మాంసాన్ని వినియోగిస్తున్నట్టు అధికారుల తనిఖీల్లో వెల్లడవుతోంది. కొన్ని సందర్భాల్లో నేరుగా హోటల్‌లోకి వెళ్తున్న అధికారులకు అక్కడ సీన్‌ చూసి బిత్తరపోతున్నారు. కుళ్లిపోయిన వాసన భరించలేక వాంతులు చేసుకుంటున్నారంటే అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ ఎంత డర్టీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. యువత, ఉద్యోగులు, వ్యాపారులు.. ఎక్కువగా హోటల్ భోజనంపైనే ఆధారపడుతున్నారు. చాలామంది రోజులో ఏదో ఒక సమయంలో బయట ఆహారం తింటున్నారు. కానీ ఆహారం తయారీ విషయంలో శుచి, శుభ్రత పాటిస్తున్నారా..? కల్తీ లేని వాటినే ఉపయోగిస్తున్నారా అనే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే.. మరోసారి హోటళ్లలో తినే ధైర్యం చేయరంటే నమ్మండి. ఎందుకంటే అక్కడ సిట్యువేషన్‌ అంత వరస్ట్‌గా ఉంటుందన్నమాట.

జాగ్రత్త పడకపోతే భారీ మూల్యం తప్పదు:
హోటళ్లలో జరిగే వరస్ట్ పిక్చర్‌ ప్రకంపనలు పుట్టిస్తోంది. నిజానికి నాన్‌ వెజ్ ప్రియులకు ఇది షాకింగ్‌ న్యూస్‌గానే చెప్పొచ్చు. ఏదో సరాదాగా హోటల్‌కు వెళ్లి తిందామనుకునే వారిని ఇలాంటి ఘటనలు కలవరపెడుతున్నాయి. ఇదీ హోటల్స్ నిర్వహణ. జిహ్వచాపల్యం పక్కన పెట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటను గ్రహించకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు. సో భోజన ప్రియులారా బీ అలర్ట్.