Pawan Kalyan : లోతుగా ఆలోచించాకే టీడీపీకి మద్దతు-పవన్ కల్యాణ్

2014లో టీడీపీకి గుడ్డిగా మద్దతివ్వలేదని, చాలా లోతుగానే ఆలోచించి మద్దతిచ్చానని చెప్పారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan : లోతుగా ఆలోచించాకే టీడీపీకి మద్దతు-పవన్ కల్యాణ్

Pawan Kalyan : చట్టసభల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని వాళ్లకు చట్టాలు చేసే హక్కు లేదన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. రాజధాని ఇక్కడే ఉంటుందని ఇల్లు కట్టుకున్న జగన్.. ఇప్పుడు మూడు రాజధానులు అని మార్చడంపై పవన్ మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలతో ఏపీకి రాజధానే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పర్యావరణం అనుకూలంగా ఉండే రాజధాని పెట్టాలని అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని కోరానని చెప్పారు. 2014లో టీడీపీకి గుడ్డిగా మద్దతివ్వలేదని, చాలా లోతుగానే ఆలోచించి మద్దతిచ్చానని చెప్పారు పవన్ కళ్యాణ్.

మంగళగిరిలో జనసేన లీగల్ సెల్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. తాను జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది రాజకీయాల్లోకి రావడమేనని అన్నారు. తాను 2003 నుంచి రాజకీయ అధ్యయనం చేస్తున్నానని, 2009లో ఒక మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా, అనేక కారణాలతో వైఫల్యం చెందామని, మళ్లీ అటువంటి తప్పు నా ఊపిరి ఉన్నంతవరకు జరగకూడదన్న ఉద్దేశంతో 2014లో జనసేన పార్టీ స్థాపించడం జరిగిందని తెలిపారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన హీరో అని, నానీ పాల్కీవాలా తనకు ఆదర్శమని పవన్ వెల్లడించారు. వారి స్ఫూర్తితోనే ఒక తరంలో మార్పు తీసుకొచ్చేందుకు తాను వచ్చానని అన్నారు. అధ్యయనం, ఉద్యమం, నిర్మాణం అనే అంబేద్కర్ మాటలు తనకు ప్రేరణ అని.. అందుకే జనసేన లీగల్ సెల్ కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లీగల్ సెల్ అని పేరు పెట్టామని వివరించారు.

తాను అవమానాలకు భయపడే వ్యక్తిని కాదని, 2019లో ఓటమి పాలవగానే తాను వెనుకంజ వేస్తానని అనుకున్నారని, అలా ఎప్పటికీ జరగదని పవన్ అన్నారు. ఈసారి గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతున్నామని, గెలిచే అభ్యర్థులే బరిలో దిగుతున్నారని పవన్ కల్యాణ్ ఆత్మవిశ్వాసంతో చెప్పారు.

వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు పవన్. ప్రజలు 151 సీట్లు ఇచ్చినంత మాత్రాన మీరేమీ మహాత్ములు అయిపోరంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో మెజారిటీ ఉంది కదా అని ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకుంటారా అని నిలదీశారు. ఈ సృష్టిలో ప్రతిదానికి ఎక్స్ పైరీ డేట్ ఉంటుందని, అది అన్నింటికీ వర్తిస్తుందని, ఈ విషయం మర్చిపోవద్దని జగన్ సర్కార్ ను హెచ్చరించారు పవన్ కల్యాణ్.