Cyclone Mandous: తీవ్ర తుపానుగా మాండౌస్.. ఏపీలోని ఆ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు..

తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరం దిశగా మాండౌస్ తుపాను దూసుకొస్తోంది. శుక్రవారం అర్థరాత్రి లేదా శనివారం తెల్లవారు జామున తుపాను తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను కారణంగా బలమైన ఈదురు గాలులు, వర్షాలు కురుస్తుండటంతో ఏపీలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.

Cyclone Mandous: తీవ్ర తుపానుగా మాండౌస్.. ఏపీలోని ఆ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు..

Cyclone Mandous

Cyclone Mandous: తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరం దిశగా మాండౌస్ తుపాను దూసుకొస్తోంది. శుక్రవారం అర్థరాత్రి లేదా శనివారం తెల్లవారు జామున తుపాను తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మాండౌస్ తుపాను కర్తెకల్, చెన్నైకి 270 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను తీరందాటే సమయంలో 65 నుంచి 85 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను తమిళనాడుతో పాటు ఏపీలోని పలు జిల్లాలపై తీవ్రప్రభావం చూపనుంది. ఇప్పటికే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

Cyclone Mandous: ఏపీకి పొంచిఉన్న ముప్పు.. తుఫానుగా మారిన తీవ్రవాయుగుండం.. ఆ జిల్లాల్లో రెడ్అలర్ట్..

మాండౌస్ తుపాను కారణంగా కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. అంతర్వేది, ఓడల రేవు తీరాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ – ఉప్పాడ బీచ్ రోడ్డుపై సముద్రపు కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఇక్కడ సుమారు పది మీటర్లు సముద్రం ముందుకొచ్చింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తుపాను ప్రభావంతో శుక్రవారం తెల్లవారు జామునుంచి భారీ ఈదురుగాలలు వీస్తున్నాయి. ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.  తుపాను ప్రభావిత జిల్లాల పరిధిలో 210 మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలకోసం మొత్తం తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. ప్రకాశం జిల్లాకు రెండు, నెల్లూరుకు మూడు, తిరుపతికి రెండు, చిత్తూరుకు రెండు సహాయ బృందాలను అధికారులు కేటాయించారు.

తుపాను ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి ఈదురుగాలులు భారీగా వీస్తున్నాయి. బి.ఎన్‌.కండ్రిగ, వరదయ్యపాలెం, సత్యవేడు, తడ, సూళ్లూరుపేట మండలాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తిరుపతి జిల్లాలో నేటి మధ్యాహ్నం నుంచి పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రమణరెడ్డి తెలిపారు. సంబంధిత పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలోనూ మధ్యాహ్నం భోజన విరామ సమయం నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ హరినారాయణ తెలిపారు. అయితే పాఠశాలల పున: ప్రారంభంపై తిరిగి సమాచారం ఇవ్వలేదు. రేపుకూడా తుపాను ప్రభావం ఇలానే ఉంటే సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.