Botsa On Rushikonda : రుషికొండపై నిర్మాణాలతో మీకేంటి నష్టం? ప్రతిపక్షాలపై మంత్రి బొత్స ఫైర్

రుషికొండపై నిర్మాణాల విషయంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి బొత్స తీవ్రంగా స్పందించారు. రుషికొండపై ప్రభుత్వ నిర్మాణాలతో మీకొచ్చే నష్టమేంటి? అని ఆయన విపక్షాలను ప్రశ్నించారు.

Botsa On Rushikonda : రుషికొండపై నిర్మాణాలతో మీకేంటి నష్టం? ప్రతిపక్షాలపై మంత్రి బొత్స ఫైర్

Botsa On Rushikonda : విశాఖ పరిధిలోని రుషికొండపై ప్రభుత్వ నిర్మాణాలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చు రాజుకుంది. వైసీపీ నేతలు అక్రమ తవ్వకాలతో యథేచ్ఛగా తవ్వేస్తున్నారంటూ టీడీపీ సహా వామపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అడ్డగోలు తవ్వకాలతో రుషికొండను మింగేస్తున్నారని ధ్వజమెత్తారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని వాపోతున్నారు. తాజాగా విశాఖ పర్యటనలో ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ సైతం.. రుషికొండకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాలను పవన్ స్వయంగా పరిశీలించారు.

రుషికొండపై నిర్మాణాల విషయంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. రుషికొండలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. రిషికొండపై ప్రభుత్వ నిర్మాణాలతో మీకొచ్చే నష్టమేంటి? అని ఆయన విపక్షాలను ప్రశ్నించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలను జనసేనాని పవన్ పరిశీలించిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. అసలు కొండపై ప్రభుత్వ నిర్మాణాలతో విపక్షాలకు వచ్చిన నష్టమేమిటని బొత్స ప్రశ్నించారు. గతంలోనూ రిషికొండపై నిర్మాణాలు ఉన్నాయి కదా అన్నారు. రిషికొండపై ఇప్పటికే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందన్న ఆయన.. రిషికొండపై ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణాలు జరుగుతున్న మాట వాస్తవమేనని తెలిపారు. రిషికొండ నిర్మాణాలపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న బొత్స.. వాటిని విపక్షాలకు కొమ్ము కాస్తున్న మీడియా భూతద్ధంలో చూపిస్తోందని విమర్శించారు.

రుషికొండపై నిర్మాణాలను పరిశీలించిన పవన్..

పవన్ కల్యాణ్ రుషికొండ పరిశీలనకు వెళ్లడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి బొత్స. రిషికొండను చూసేందుకు ఓ సెలెబ్రిటీ వచ్చారని ఎద్దేవా చేశారయన. అక్కడ ఏదో జరిగిపోతోందని అనవసర హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. రుషికొండలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. గతంలో అక్కడ గెస్ట్ హౌస్ ఉండేదని, ఇప్పుడు దాన్ని తొలగించి మరో భవనం నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. అందులో తప్పేముందని పవన్ ను ప్రశ్నించారు మంత్రి బొత్స.

”పవన్‌ కల్యాణ్‌ రాద్ధాంతం చేయడం వల్ల గోరంత కూడా ఉపయోగం ఉండదు. రుషికొండలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నాం.. తప్పేంటి? ఇక్కడ గతంలో కూడా భవనాలు ఉన్నాయి. విజయనగరం గుంకలాం వద్ద రాష్ట్రంలోనే అతిపెద్ద టౌన్‌షిప్‌ నిర్మిస్తున్నాం. గుంకలాంలో జగనన్న కాలనీ పూర్తి చేయడానికి నాలుగేళ్లు పడుతుంది’’ అని బొత్స అన్నారు.

ప్రధాని సభలో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్‌ అని మంత్రి బొత్స అన్నారు. ప్రజల అవసరాలను సీఎం ప్రధాని దృష్టికి హుందాగా తీసుకెళ్తారని చెప్పారు. కానీ కొన్ని పార్టీలకు స్వప్రయోజనాలే ముఖ్యంగా మారాయని ఆయన మండిపడ్డారు. విశాఖ సభ ద్వారా సీఎం జగన్‌ మంచి మెసేజ్‌ ఇచ్చారని మంత్రి తెలిపారు.