ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తోంది : నిమ్మగడ్డ రమేష్ కుమార్

ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తోంది : నిమ్మగడ్డ రమేష్ కుమార్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ (SEC) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మీడియాతో మాట్లాడారు. ఈ సంధర్భంగా తనకు హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉండేదని, దాన్ని సరెండర్ చేసి తాను పుట్టి పెరిగిన చదువుకున్న ఊరు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు. అయితే, తనకు ఓటు హక్కు రాలేదని అన్నారు. తాను దుగ్గిరాలలోనే ఉంటున్నా కూడా తాను అక్కడ ఉండడం లేదనే కారణంతో తనకు ఓటు హక్కు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.

తాను దుగ్గిరాల స్కూల్లోనే చదువుకున్నానని, అక్కడే ఆస్తులు కూడా ఉన్నాయని చెప్పారు. ఓటరు కార్డు అంశంపై ఓసారి తమ వద్ద హాజరుకావాలని స్థానిక తహసీల్దార్ కోరారని, అయితే, అదే సమయంలో చీఫ్ సెక్రటరీతో సమావేశం కారణంగా హాజరుకాలేకపోయానని అన్నారు. మరో రోజు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినా పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై తాను కలెక్టర్‌ను కలసి విజ్ఞప్తి చేస్తానన్న ఎస్ఈసీ.. అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్తానన్నారు. తనకు ఓటు హక్కు కల్పిస్తే తాను కూడా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేవాడినని నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు.

సుప్రీంకోర్టు నిర్మాణాత్మక సూచనలు చేసిందని, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తోందని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, సుప్రీంకోర్టు తీర్పు తరువాత గవర్నర్‌ను కలిసి ఎస్ఈసి గౌరవాన్ని కాపాడాలని కోరానని, రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకంగా అధికారపార్టీ పెద్దలు మాట్లాడుతున్నారని అన్నారు. తాను మొదటి నుంచి ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా ఉన్నానని, ఏకగ్రీవాలపై విపక్షపార్టీల అభ్యంతరాలు స్వీకరించినట్లు చెప్పుకొచ్చారు.

ఎన్నికలు మొదలయ్యాక అన్ని విషయాలు కమిషన్ పరిధిలోనే ఉంటాయని, ఏ నిర్ణయమైనా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిందే అని తెలిపారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరపకుండా ఏకగ్రీవాలు చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన మీద నిమ్మగడ్డ స్పందించారు. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక ఎన్నికలను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రభావితం చేసేలా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు. ఏదైనా ప్రకటన ఇచ్చేముందు కమిషన్‌ను సంప్రదించాలని స్పష్టం చేశారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న నిబంధనేనని, ఏకగ్రీవాల అడ్వర్టైజ్మెంట్ మీద సంజాయిషీ కోరినట్టు నిమ్మగడ్డ చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటిసి ఏకగ్రీవాలపై కమిషన్ విచారణ జరుగుతుందని, తుదినిర్ణయం ఇంకా తీసుకోలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు.