Rains And Floods : సీమ జిల్లాల్లో జల విలయంతో ప్రయాణికుల కష్టాలు

ఓ వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరోవైపు ఈశాన్య రుతుపవనాలు. వెరసి భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు తల్లడిల్లాయి.

Rains And Floods : సీమ జిల్లాల్లో జల విలయంతో ప్రయాణికుల కష్టాలు

Railway Track Destroyed

Rains And Floods :  ఓ వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరోవైపు ఈశాన్య రుతుపవనాలు. వెరసి భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు తల్లడిల్లాయి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. పలు వాగులు వంకలు పొంగి పొర్లి పలు కాలనీలు నీటమునిగాయి.

అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుపతిలో మునుపెన్నడూ చూడన విధంగా వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు వరదల కారణంగా తిరుమల కొండచరియలు విరిగి ఘాట్‌ రోడ్డుపై పడిపోయాయి. అంతేకాకుండా మెట్టుమార్గంలో చెట్లు, వరద నీటితో అస్థవ్యస్థంగా తయారైంది. తిరుమల కొండలపైనుంచి వస్తున్న వాన నీటితో కపిలతీర్ధంలో మండపం కూలిపోయింది.

తాజాగా వర్షం తగ్గుముఖం పట్టిన నేపథ్యంతో తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ శుభవార్త  చెప్పింది.  శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకోసం  రెండు ఘాట్‌ రోడ్ల ద్వారా అనుమతిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తిరుమల నడక రహదారులను పునరుద్దరణ చేస్తున్నట్లు తెలిపింది.  కానీ ద్విచక్రవానహనాలకు అనుమతి నిరాకరించినట్లు వెల్లడించింది. టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

మరో వైపు రాయలసీమ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో రవాణా సదుపాయాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుపతి నుంచి వెళ్లే పలు రైళ్లను   రైల్వే అధికారులు రద్దు చేశారు.   కొన్ని రైళ్లను దారి మళ్లింపు చేపట్టారు.  కడప, నెల్లూరు లకు వెళ్లే రైల్వే ట్రాక్‌లు   పలుచోట్ల ధ్వంసం అయ్యాయి. రాజంపేట – నందలూరు వద్ద ట్రాక్ ధ్వంసం కావడంతో కడప  వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది.

నెల్లూరు జిల్లా నాయుడు పేట వద్ద బ్రిడ్జి కొట్టుకుపోవడంతో నెల్లూరు వైపు వెళ్లే రైళ్లకు బ్రేక్ పడింది. రైళ్ల సమాచారాన్ని రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు ఆయా ప్రయాణికులకు ఎస్ఎంఎస్ ద్వారా చేరవేస్తున్నారు. రైల్వే అధికారులు పలు రైళ్లు రద్దు చేశారు.

కాగా చాలా చోట్ల రోడ్డు దెబ్బతినటంతో బస్సులు పాక్షికంగా నడుస్తున్నాయి. తిరుపతి నుంచి యధావిధిగా విమాన ప్రయాణాలు సాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 48 బ్రిడ్జిలు, 50 కల్వర్టులు కూలిపోవడంతో  191 ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు ప్రాధమికంగా అధికారులు ఒక అంచానాకి వచ్చారు. జిల్లాలో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు ధ్వంసం అయ్యాయి.

నెల్లూరు జిల్లాలో పెన్నా నదికి వరదనీరు పోటెత్తటంతో  కోవూరు మండలం  పడుగుపాడు వద్ద పెన్నా వరద ఉధృతికి చెన్నై -కలకత్తా జాతీయ రహదారి కొట్టుకు పోయింది. దెబ్బతిన్న జాతీయ రహదారికి అధికారులు శరవేగంగా పునరుద్ధరణ పనులు చేపట్టారు.   దీంతో ఆ ప్రాంతంలో  5 కిలోమీటర్లు మేర ట్రాఫిక్ జాం అయ్యింది.  అక్కడ ఒకవైపు నుంచే  రాకపోకలు సాగిస్తున్నారు.  పలు మార్గాల్లో వాహనలను దారి మళ్లించారు. తిరుపతి నుంచి వచ్చే వాహనాలు కడప, దర్శి మీదుగా వెళ్లేలా దారి మళ్లించారు.   కోతకు గురైన రహదారిని జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ పరిశీలించారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి రాకపోకలను పురుద్దరిస్తామని కలెక్టర్ తెలిపారు.

నెల్లూరు జిల్లాలోని పెన్నానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. సోమశిల జలాశయం ఇన్‌ఫ్లో 3 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద నీరు పలు గ్రామాలను ముంచెత్తింది. ఇప్పటికే అనేక గ్రామాలలోని  లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వెంకటేశ్వర పురం వద్ద రైల్వే ట్రాక్ ను తాకుతూ పెన్నా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ ట్రాక్ పై నడిచే పలు రైళ్లను రద్దు చేశారు.
Also Read : AIADMK Leader Maitreyan : చంద్రబాబుకు అన్నాడీఎంకే నేత మైత్రేయన్ ఫోన్
సంగం మండలం కోలగట్ల వద్ద నెల్లూరు- ముంబాయి జాతీయ రహదారిపై వరదనీరు వచ్చి చేరటంతో రాకపోకలకు  అంతరాయం ఏర్పడింది. బుచ్చి మండలం దామరమడుగు వద్ద, కోవూరు సాలు చింతల వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. కోవూరు జలదిగ్భంధంలో చిక్కుకుంది.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా 9522.5 హెక్టార్లలో పంటలు నష్ట పోయినట్లు అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు.  6 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 615 కిలోమీటర్లు రోడ్లు ధ్వంసం అయ్యాయి. దీనివల్ల 260 ఆర్టీసీ బస్సులు రద్దు కావటంతో కోటికి పైగా నష్టం వాటిల్లినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

కడప జిల్లాలో కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జ్ వరదలు కారణంగా డామేజ్ అయింది. బ్రిడ్జ్ మరమ్మతుల కోసం ప్రత్యేక నిపుణుల బృందాన్ని పిలుస్తున్నాం అని నేషనల్ హైవేస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఓబుల్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు డ్యామేజ్ అయిన బ్రిడ్జిని రిపేర్ చేయడమా లేక కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాలా అన్న అంశం పై అధికారులతో చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. వరద ప్రవాహం తగ్గితే ప్రత్యామ్నాయ రోడ్లు వేయడానికి ప్రయత్నిస్తామని ఆయన వివరించారు. వరద ప్రవాహం తగ్గితే తప్ప రాకపోకలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించలేమని ఆయన అన్నారు.

మరోవైపు ప్రకాశం జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోవటంతో.. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రైలుబళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చీరాలలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు నిలిపి వేయగా….వేటపాలెం లో పూరి ఎక్స్ ప్రెస్ రైలును అధికారులు ఆపివేశారు. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు.