ఏపీ శాశ్వత రాజధాని అమరావతే : విలీనం..విలీనం అనొద్దని పవన్ సీరియస్

రాజధాని రైతులకు అండగా ఉంటామని బీజేపీ-జనసేన నేతలు ప్రకటించారు. రాజధాని రైతులకు మద్దతుగా ఫిబ్రవరి 2న తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్

  • Edited By: veegamteam , January 23, 2020 / 01:53 AM IST
ఏపీ శాశ్వత రాజధాని అమరావతే : విలీనం..విలీనం అనొద్దని పవన్ సీరియస్

రాజధాని రైతులకు అండగా ఉంటామని బీజేపీ-జనసేన నేతలు ప్రకటించారు. రాజధాని రైతులకు మద్దతుగా ఫిబ్రవరి 2న తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్

రాజధాని రైతులకు అండగా ఉంటామని బీజేపీ-జనసేన నేతలు ప్రకటించారు. రాజధాని రైతులకు మద్దతుగా ఫిబ్రవరి 2న తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తామన్నారు. ఏ పోరాటమైనా రెండు పార్టీలు కలిసే చేస్తాయన్నారు. బీజేపీ-జనసేన నేతలు గురువారం(జనవరి 23,2020) ఉదయం మీడియాతో మాట్లాడారు. ప్రతి 15 రోజులకొకసారి బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం అవుతుందని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. సమన్వయ కమిటీలో బీజేపీ, జనసేన నుంచి ఎవరెవరు ఉంటారు అనేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. జగన్ ప్రభుత్వంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయాలను తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆరోపించారు. 

ఏ పోరాటం చేసినా కలిసే:
ప్రభుత్వాలు మారినా.. పని తీరు మారలేదని జనసేనాని పవన్ అన్నారు. త్వరలోనే రాజధానిపై బీజేపీ, జనసేన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఏపీ శాశ్వత రాజధాని అమరావతే అని పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. విశాఖలో రిపబ్లిక్ పరేడ్ నే నిర్వహించలేనప్పుడు.. రాజధానిని సులువుగా ఎలా మారుస్తారు? అని జగన్ ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. కాగా, జనసేనని విలీనం చేశారా అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్న పవన్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మాటిమాటికి విలీనం..విలీనం.. అంటారేంటి? అని పవన్ సీరియస్ అయ్యారు. ఉద్దేశపూర్వకంగానే విలీనం అంటున్నారా? అని ఆ జర్నలిస్టుని నిలదీశారు. మరోసారి అలా అనొద్దని హెచ్చరించారు.

నడ్డాతో సమావేశం:
మీడియా సమావేశంలో బీజేపీ నుంచి జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ, సునీల్ దేవ్ ధర్, పురంధేశ్వరి… జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జేపీ నడ్డాని బీజేపీ-జనసేన నేతలు సంయుక్తంగా వెళ్లి మర్యాదపూర్వకంగా కలుస్తామని బీజేపీ నేత జీవీఎల్ చెప్పారు. ఏపీలో రాజకీయ పరిణామాలు ఇతర అంశాల గురించి నడ్డాకు వివరిస్తామన్నారు.

ఏపీలో ఇప్పటికే పొత్తు పెట్టుకున్న జనసేన, బీజేపీ కూటమి సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. అమరావతి రైతులకు మద్దతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా కవాతు రూపంలో ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించింది బీజేపీ-జనసేన కూటమి. ఏపీలో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ, నాదెండ్ల మనోహన్, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి వంటి నేతలు ఈ సమావేశంలో చర్చించారు. ప్రతి 15 రోజులకు ఓసారి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. జనవరి 28న మరోసారి రెండు పార్టీల ముఖ్య నేతలు భేటీ అవుతారని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.