Uppada Sea : నీలి, ఎరుపు రంగుల్లో దర్శనమిస్తున్న ఉప్పాడ సముద్రం

యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్రంలోకి భారీగా వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో ఓ వింత దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్రం నీలి, ఎరుపు రంగులుగా దర్శనమిస్తోంది.

Uppada Sea : నీలి, ఎరుపు రంగుల్లో దర్శనమిస్తున్న ఉప్పాడ సముద్రం

Uppada Sea (1)

Uppada sea : ఏపీలో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఎగువన కురిసిన వర్షాలకు యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్రంలోకి భారీగా వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో ఓ వింత దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్రం నీలి, ఎరుపు రంగులుగా దర్శనమిస్తోంది. సముద్ర ప్రేమికులు రెండు రంగుల సముద్రం అలరిస్తోంది. అయితే, ఈ పరిణామాన్ని తీరప్రాంత వాసులు మాత్రం కీడుగా భావిస్తున్నారు. కాగా, ప్రతి సంవత్సరం వరదల సమయంలో సముద్రం ఇదే విధంగా దర్శనమిస్తుందని మత్స్యకారులు అంటున్నారు.

ఎగువనున్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కడెంవాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఉప్పెనలా వరదతో గోదావరి విరుచుకుపడుతోంది. వరద ఉధృతి ధాటికి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న తొమ్మిది ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా ఎత్తేశారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతి, లక్ష్మీ, సరస్వతి బ్యారేజ్‌లను గోదావరి వరద ముంచెత్తింది.

Milky Sea: తొలిసారి కెమెరా కంటపడ్డ పాల సముద్రం

పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరద పోటుకి బలహీనంగా ఉన్న గోదావరి గట్లు కూలిపోతున్నాయి. నరసాపురంలోని వశిష్ట గోదావరి ఏటిగట్టు గత రాత్రి నదిలో కూలిపోయింది. దీంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఎక్కడి నుంచి ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన అధికారులు గోదావరి గట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలు పేర్చుతున్నారు.

ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి మహోగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి శాంతించింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం నిలకడగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 23.30 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాగా, ఇంకా 241 గ్రామాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. ఆయా గ్రామాల్లో వరద నీరు తొలగిపోలేదు. గోదావరి వరదలతో 6 జిల్లాల్లోని 385 గ్రామాలు ప్రభావితం అయ్యాయి.