షోకాజ్ పాలిటిక్స్ : ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏం చెబుతారు 

  • Edited By: madhu , June 25, 2020 / 03:53 AM IST
షోకాజ్ పాలిటిక్స్ : ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏం చెబుతారు 

ఏపీలో అధికార పార్టీకి ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం తలనొప్పిగా మారింది. సొంతపార్టీ ఎంపీయే ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించడం… అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి మింగుడుపడటం లేదు. దీంతో ఆయనపై చర్యలకు వైసీపీ రెడీ అయ్యింది. వైసీపీ హైకమాండ్‌ రఘురామకృష్ణంరాజుకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేరిట ఈ నోటీసులు ఇచ్చారు. పలు సందర్భాల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని… పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టలు దెబ్బతీసేలా వ్యవహరించారని… షోకాజ్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలుగా చూపుతూ కొన్ని పత్రికల పేపర్‌ కటింగ్స్‌ కూడా జోడించారు. షోకాజ్‌ నోటీసులపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని.. లేకుంటే  చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో హెచ్చరించారు.

తనకు వైసీపీ అధిష్టానం నుంచి షోకాజ్‌ నోటీసులు అందిన విషయాన్ని రఘురామకృష్ణంరాజు ధృవీకరించారు. తనకు పార్టీ నుంచి 18 పేజీలతో నోటీసు వచ్చిందని… అందులో రెండు పేజీలు రిటన్‌ షోకాజ్‌ నోటీసుకాగా.. మరో 16 పేజీలు పేపర్‌ క్లిక్పింగ్స్‌ ఉన్నాయన్నారు. తాను పార్టీనికానీ.. అధ్యక్షుడిని కానీ పల్లెత్తుమాట అనలేదన్నారు.

సీఎం అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడంతోనే… మీడియా ద్వారా కొన్ని సూచనలు చేసినట్టు తెలిపారు. నేను ప్రభుత్వానికి సూచనలు చేశానే తప్ప పార్టీకి కాదని ఆయన తెలిపారు. 2020, జూన్ 25వ తేదీ గురువారం షోకాజ్‌ నోటీసులకు సంజాయిసీ ఇవ్వనున్నట్టు  స్పష్టం చేశారు.

2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి టిక్కెట్ ఆశించిన రఘురామకృష్ణం రాజు.. వేరేవాళ్లకి దక్కడంతో ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. అయితే రాజకీయ సమీకరణాలతో విత్ డ్రా చేసుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన బీజేపీలో చేరారు. 2019లో టీడీపీలోకి జంప్ చేశారు. ఎన్నికలకు 20రోజుల ముందు వైసీపీలో చేరి నరసాపురం లోక్‌సభ స్థానం టిక్కెట్ దక్కించుకొని విజయం సాధించారు.

గెలిచిన తర్వాత రఘురామకృష్ణం రాజు వ్యవహార శైలిలో మార్పువచ్చిందని, బీజేపీకి దగ్గరగా ఉంటున్నారని ప్రచారం జరిగింది. నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఎంపీతో సంబంధం లేకుండా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో పార్టీకి, నాయకులకు ఎంపీ దూరం అయ్యారని చెబుతున్నారు. ఇక టీటీడీ భూముల వ్యవహారం, ఉచిత ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అవినీతి జరిగినట్లు ఎంపీ బహిరంగంగానే విమర్శలు చేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది.

రఘురామకృష్ణంరాజు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని.. అందుకే పార్టీపై విమర్శలు చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యేలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన షోకాజ్‌ నోటీసుకు ఏం సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Read: GGH Hospital : అచ్చెన్నాయుడి డిశ్చార్జి డ్రామా