స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినం, ఆలయాల్లో వేడుకలు

Swaroopanandendra Saraswati birthday : విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలకు రెడీ అవుతున్నారు. ఈనెల 18న ఆయన జన్మదినం. స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినాన్ని పురస్కరించుకున్ని అన్ని ఆలయాల్లో వేడుకలు నిర్వహించాలని ఏపీ దేవాదాయశాఖ నిర్ణయం తీసుకుంది. 18న ఏపీలోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ అదనపు కమిషనర్ కె. రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలు నిర్వహించాలని దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేవాలయం, ద్వారకా తిరుమల, రామతీర్థం, సింహాచలం, కనక మహాలక్ష్మి, అన్నవరం, అంతర్వేది, మావుళ్లమ్మ దేవస్థానం ఈవోలకు ఆయన మెమో పంపారు.
ఈనెల 9న విశాఖ శారదాపీఠం మేనేజర్ పి. రామకృష్ణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈనెల 18న విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించనున్నామని… వాటిని ఏపీలోని ఆలయాల్లో నిర్వహించేందుకు అనుమతించాల్సిందిగా విన్నవించారు. లేఖలో పేర్కొన్న దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆయా దేవాలయాల ఈవోలకు దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈనెల 18న ఏపీలోని దేవాలయాల్లో స్వరూపానందేంద్ర సరస్వతి పుట్టినరోజు వేడుకలకు మార్గం సుగమమైంది. శ్రీ శారదాపీఠం నిర్వాహకులు ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.